
చూపు.. పామాయిల్ వైపు..
పల్నాడు రైతులకు రెండేళ్లుగా వరుస నష్టాలు ఎదురవుతున్నాయి. సాధారణంగా అధికంగా పండించే మిర్చి సాగు చేసినా అప్పుల పాలవుతున్నారు. పత్తి పంటకు చీడపీడల దెబ్బకు గిట్టుబాటు కావడం లేదు. పొగాకు కొనేవారు కూడా కరువయ్యారు. ఈ నేపథ్యంలో మెట్ట రైతులు పామాయిల్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఉద్యాన శాఖ ప్రోత్సాహంతో ఇప్పటికే జిల్లా రైతులు పెద్ద ఎత్తున సాగు చేస్తున్నారు.
● తొలుత 8 మండలాల్లో మొదలైన మొక్కల పెంపకం ● ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 1,408 ఎకరాల్లో తోటలు ● ఈ ఏడాది సాగు లక్ష్యం 3,300 ఎకరాలు ● ఉచితంగా మొక్కల పంపిణీ.. డ్రిప్, అంతర పంటలకు సబ్సిడీ ● సాధారణ పంటలకు ప్రత్యామ్నాయం అంటున్న ఉద్యాన శాఖ అధికారులు
కేంద్రం ప్రోత్సాహంతో జిల్లాలో పెరుగుతున్న సాగు విస్తీర్ణం
సాక్షి, నరసరావుపేట: ఇప్పటివరకు పామాయిల్ తోటలంటే పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కృష్ణా జిల్లాలే గుర్తుకొస్తాయి. రెండు, మూడేళ్లుగా పల్నాడు జిల్లాలోనూ ఈ సాగు క్రమంగా పెరుగుతోంది. అనుకూల వాతావరణం, భూసారం, నీటి లభ్యత వంటి అంశాలపై ఉద్యాన శాఖ చేసిన సర్వేలో 8 మండలాలు అనుకూలంగా ఉన్నట్లు గుర్తించారు. ఇందులో పిడుగురాళ్ల, అమరావతి, రాజుపాలెం, బెల్లంకొండ, నాదెండ్ల, ఈపూరు, మాచవరం, సత్తెనపల్లి మండలాలు ఉన్నాయి. పామాయిల్ గెలలను నేరుగా తోటలోనే కొనుగోలు చేస్తారు. వ్యాల్యూ ఆయిల్ అండ్ గ్యాస్ సర్వీసెస్ సంస్థకు ఆరు మండలాలు, గోద్రెజ్ ఆగ్రోవేట్ సంస్థకు రెండు మండలాలు కేటాయించారు. ఈ రెండు సంస్థలు రైతులకు మెలకువలు నేర్పడంతోపాటు మద్దతు ధరకే పామాయిల్ కొనుగోలు చేస్తున్నాయి.
అన్నివిధాలా ప్రోత్సాహం
ఈ మండలాల పరిధిలో ఇప్పటి వరకు 1,408 ఎకరాల్లో పామాయిల్ సాగు చేశారు. బెల్లంకొండ, మాచవరం, ఈపూరు మండలాల్లో అధికంగా రైతులు మొగ్గు చూపారు. ఈ ఏడాది సాగు లక్ష్యం 3,300 ఎకరాలుగా నిర్ణయించారు. పామాయిల్ దిగుమతిపై ఆధారపడకుండా రైతులకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తోంది. వంట నూనెల మిషన్ ఏర్పాటు చేసి సాగు ఉత్పత్తి పెంచేందుకు కృషి చేస్తోంది. ఇందులో భాగంగా మొక్కలను ఉచితంగా అందిస్తున్నారు. ఎకరానికి 57 మొక్కలను 9/9 మీటర్లకు ఒకటి చొప్పున నాటాల్సి ఉంటుంది. హెక్టారుకు 150 మొక్కలను ఉచితంగా అందజేస్తారు. విదేశీ రకమైతే రూ.29 వేలు, స్వదేశీ రకమైతే రూ.20 వేలు రాయితీ లభిస్తుంది. తోట నిర్వహణకు హెక్టారుకు రూ.5,250 చొప్పున నాలుగేళ్ల పాటు అందిస్తారు. అంతర్ పంటల సాగుకు మరో నాలుగేళ్లపాటు ఏడాదికి రూ.5,250 చొప్పున ఇస్తారు. బిందు సేద్యం పరికరాలను సైతం రాయితీపై తీసుకొవచ్చు. పామాయిల్ హెక్టారుకు సగటున 25 నుంచి 30 టన్నుల గెలలు దిగుబడి ఉంటుంది. టన్ను ధర సుమారుగా రూ.18 వేల వరకు ఉంటుందని రైతులు చెబుతున్నారు.
ఉచితంగా మొక్కలు పంపిణీ
జిల్లాలో పామాయిల్ సాగును ప్రోత్సహించేందుకు కృషి చేస్తున్నాం. ఎంపిక చేసిన 8 మండలాల్లో ఇప్పటికే సుమారు 564 హెక్టార్లలో సాగు అయింది. మొక్కలను ఉచితంగా అందజేస్తాం. సాగు ఖర్చులో 50 శాతం సబ్సిడీ ఉంటుంది. అంతర్ పంటల సాగుకూ రాయితీ ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకరిస్తున్నాయి.
– ఇంటూరు వెంకట్రావు,
జిల్లా ఉద్యాన శాఖ అధికారి, పల్నాడు
ప్రత్యామ్నాయంగా పామాయిల్
గతేడాది రెండు ఎకరాల్లో పామాయిల్ సాగు ప్రారంభించాను. ఉద్యాన శాఖ అధికారులు భూములను పరిశీలించి అనుకూలమని తేల్చారు. మిర్చి, పత్తి పంటలలో వరుస నష్టాల నేపథ్యంలో దీర్ఘకాలిక ఉద్యాన పంటల వైపు మొగ్గు చూపాం. ఉపాఽధి హామీ పథకం కింద అన్నివిధాలా సహకారం లభిస్తోంది. నాలుగేళ్లపాటు అంతర్ పంటలకు వెసులుబాటు ఉండటం రైతుకు మేలు చేకూరుస్తుంది.
– ఆది కోటేశ్వరరావు, రైతు, వెంకటాయపాలెం

చూపు.. పామాయిల్ వైపు..

చూపు.. పామాయిల్ వైపు..