
హోంగార్డు కుటుంబానికి రూ.5 లక్షలు సాయం
నరసరావుపేట రూరల్: అనారోగ్యంతో మృతిచెందిన హోంగార్డు కుటుంబానికి తోటి హోంగార్డులు అండగా నిలిచారు. మృతుని కుటుంబానికి ఒక రోజు వేతన మొత్తం రూ.5 లక్షలను సాయంగా అందించారు. తెనాలి రూరల్ పీఎస్‌లో విధులు నిర్వహిస్తూ హోంగార్డు వై.శ్రీనివాస్ ఈ ఏడాది ఫిబ్రవరి 18వ తేదీన గుండెపోటుతో మృతిచెందాడు. హోంగార్డు కుటుంబానికి అండగా నిలిచేందుకు తోటి హోంగార్డులు ముందుకు వచ్చారు. ఒక రోజు వేతనాన్ని సాయంగా అందించారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ కార్యాలయంలో గురువారం జిల్లా అదనపు ఎస్పీ జేవీ సంతోష్ చేతుల మీదగా శ్రీనివాస్ కుటుంబసభ్యులకు సాయం చెక్‌ను అందజేశారు. హోంగార్డు కుటుంబానికి సాయం చేసేందుకు ముందుకు వచ్చని జిల్లా హోంగార్డులను అదనపు ఎస్పీ అభినందించారు. అలాగే హోంగార్డుగా విధులు నిర్వహిస్తూ గుండెపోటు కారణంగా ఉద్యోగ విరమణ చేసిన బండ్లమోటు పిఎస్ హోంగార్డు ఎ.నాసరయ్యకు రూ.5 లక్షల చెక్‌ను అదనపు ఎస్పీ సంతోష్ అందించారు.