అభివృద్ధిపై చర్చకు వచ్చే దమ్ముందా? | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధిపై చర్చకు వచ్చే దమ్ముందా?

Jul 11 2025 5:53 AM | Updated on Jul 11 2025 5:53 AM

అభివృద్ధిపై చర్చకు వచ్చే దమ్ముందా?

అభివృద్ధిపై చర్చకు వచ్చే దమ్ముందా?

సత్తెనపల్లి: ఎవరి హయాంలో, ఏ విధమైన అభివృద్ధి జరిగిందో చర్చకి వచ్చే దమ్ము చంద్రబాబు, అండ్‌ కోకు ఉంటే తన సవాల్‌ను స్వీకరించాలని వైఎస్సార్‌ సీపీ నరసరావుపేట పార్లమెంటు పరిశీలకులు పూనూరు గౌతంరెడ్డి అన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి లోని వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ కార్యాలయంలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్‌ గజ్జల సుధీర్‌ భార్గవ్‌ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ‘బాబు ష్యూరిటీ– మోసం గ్యారంటీ’ చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుచేస్తూ .. నిర్వహించిన వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ విస్త్తృతస్థాయి సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సమావేశానికి పార్టీ పట్టణ అధ్యక్షుడు షేక్‌ మౌలాలి అధ్యక్షత వహించారు. పూనూరు గౌతమ్‌ రెడ్డి మాట్లాడుతూ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో ఐదేళ్లలో ఏం అభివృద్ధి జరిగిందో, చంద్రబాబు 21 ఏళ్లలో ఏం అభివృద్ధి జరిగిందో చర్చకు వస్తే సత్తెనపల్లి వేదికగా తేల్చుకుందామని, ఈ సవాల్‌ను చంద్ర బాబు, అండ్‌ కో మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరైనా నెల రోజుల్లోపు స్వీకరించవచ్చన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి ఏడాది అయిందని పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలకు ఏం చేశారని ప్రశ్నించారు. వందలాది మంది వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలను హతమార్చడం, వేలాది మందిని క్షతగాత్రులు చేయడం తప్ప మరొకటి లేదన్నారు. మీరు పెట్టే అక్రమకేసులకు, లాఠీలకు, తూటాలకు భయపడేది లేదన్నారు.

స్మార్ట్‌ మీటర్ల పేరుతో రూ. 23 లక్షల కోట్ల భారం

వైఎస్సార్‌ సీపీ శ్రేణులంతా కలిసికట్టుగా ఐకమత్యంతో పని చేయాలని, అప్పుడే ఎలాంటి అక్రమ కేసులైనా ఎదుర్కోవచ్చునన్నారు. పల్నాడు జిల్లాలో పార్టీకి పట్టుకొమ్మ లాంటిది సత్తెనపల్లి నియోజకవర్గమన్నారు. వైఎస్సార్‌ సీపీకి కార్యకర్తలే బలమన్నారు. స్మార్ట్‌ మీటర్ల పేరుతో రూ. 23 లక్షల కోట్ల భారం ప్రజలపై చంద్రబాబు వేయనున్నారన్నారు. నాడు వైఎస్‌ జగన్‌ యూనిట్‌ రూ. 2కు విద్యుత్‌ కొనుగోలు చేస్తే పెడబొబ్బలు పెట్టిన చంద్రబాబు, ఎల్లో మీడియా ఇప్పుడు యూనిట్‌ రూ. 4.75 కొంటుంటే మౌనంగా ఉంటున్నారన్నారు. జగన్‌ హయాంలో 1.35 లక్షల పర్మినెంట్‌ ఉద్యోగాలు, 4 లక్షల వలంటరీ ఉద్యోగాలు ఇస్తే.. చంద్రబాబు ఏపీ ఫైబర్‌లో 1200 మందిని, ఏపీ బేవరేజెస్‌లో 18 వేల మందిని, 4 లక్షల వలంటీర్లను తొలగించాడన్నారు. చంద్రబాబు చేస్తున్న మోసాలను ఇంటింటికీ తెలియజేయవలసిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాలు, పట్టణంలో పర్యటించి చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తు చేస్తూ .. మోసాలు వివరిద్దమన్నారు.

ఇంటింటికి చంద్రబాబు మోసాలు

నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్‌ గజ్జల సుధీర్‌ భార్గవ్‌రెడ్డి మాట్లాడుతూ వైఎస్‌ జగన్‌ అమలు చేసిన సంక్షేమ పథకాలకు పేర్లు మారుస్తూ చంద్రబాబు కోతలు విధిస్తున్నాడన్నారు. దివ్యాంగుల పెన్షన్లకు వెరిఫికేషన్‌ పేరుతో ఇబ్బందులకు గురి చేస్తున్నాడన్నారు. చంద్రబాబు ఒక్క వాగ్దానాన్ని కూడా పూర్తిస్థాయిలో అమలు చేయడం లేదన్నారు. చంద్రబాబు మేనిఫెస్టోను ఇంటింటికి వివరించాల్సిన అవసరం ఉందన్నారు. రెంటపాళ్ళ జగన్‌ పర్యటనను ఎలా విజయవంతం చేశామో అదే ఊపు, ఉత్సాహంతో మరో మూడేళ్లు పని చేయాలన్నారు. వైఎస్సార్‌ సీపీ నాయకులు పక్కాల సూరిబాబు, డాక్టర్‌ గీతా హసంతి, రోళ్ల మాధవి, చలంచర్ల సాంబశివరావు, గంగారపు అనూష, రాజవ రపు శివ నాగేశ్వర రావు, రాయపాటి పురుషోత్తమరావు, నక్కా శ్రీను, వేపూరి శ్రీనివాసరావు, భవనం రాఘవరెడ్డి, మర్రి సుబ్బారెడ్డి, ఎంజేఎం రామలింగారెడ్డి లు మాట్లాడారు. సమావేశంలో నాయకులు రమావత్‌ కోటేశ్వరరావు నాయక్‌, ముక్త్యార్‌, సయ్యద్‌ ఘోర, షేక్‌ జలీల్‌, అచ్యుత శివప్రసాద్‌, తుమ్మల వెంకటేశ్వరరావు, చిలుక జైపాల్‌, లోకా మాధవ, గడ్డం వెంకటేశ్వర్లు, వాకు మళ్ళ చెంచిరెడ్డి, చిన్నం మణి బాబు తదితరులు పాల్గొన్నారు.

ఎవరి హయాంలో అభివృద్ధి జరిగిందో సత్తెనపల్లిలో తేల్చుకుందాం

చంద్రబాబు మోసాలను

ఇంటింటికి చాటుదాం

వైఎస్సార్‌ సీపీ నరసరావుపేట పార్లమెంటు పరిశీలకులు పూనూరు గౌతమ్‌ రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement