
వైఎస్సార్ సీపీ కార్యకర్తపై పోలీసుల జులుం
వినుకొండ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై రెడ్‌బుక్ చర్యలు ఆగడంలేదు. పోలీసుల సహాయ సహకారాలతో వేధింపుల పర్వం కొనసాగుతోంది. తాజాగా ఈపూరు మండలం ఇనిమెళ్ల గ్రామానికి చెందిన రామినీడి అనీల్ అనే వైఎస్సార్ సీపీ కార్యకర్తపై ఈపూరు పోలీసులు తమ ప్రతాపం చూపారు. గురువారం స్టేషనకు పిలిపించి అర్ధరాత్రి వరకు తమదైన శైలిలో కౌన్సెలింగ్ ఇచ్చారు. ఇంతకు అనీల్‌చేసిన నేరమేమిటంటే.. ఇటీవల హైదరాబాద్‌లోని ఓ టీవీ కార్యాలయంపై కొందరు దాడిచేసి కార్యాలయాన్ని ధ్వంసం చేయడంపై.. అనీల్ సోషల్ మీడియాలో సాక్షి మీడియాపై కూడా రాష్ట్రంలో దాడులు జరగలేదా..? అని పోస్టు పెట్టడమే. దీనిని గమనించిన స్థానిక టీడీపీ నాయకులు పోలీసుల సాయంతో అనీల్‌ను స్టేషనుకు పిలిపించి కౌన్సెలింగ్ ఇప్పించారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ నాయకులు అనీల్ కోసం స్టేషన్‌కు వెళ్లగా వారిని చూసి పోలీసులు అనీల్‌ను వదలిపెట్టడం గమనార్హం.
● తాము చెప్పినట్లు నడుచుకోకపోతే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించినట్లు బాధితుడు తెలిపారు. సోషల్ మీడియాలో పోస్టు తొలగించినప్పటికీ కనికరంలేకుండా పోలీసులు క్రూరంగా తనను హింసించినట్లు తెలిపాడు. పోలీసులే ఇలాంటి చర్యలకు పాల్పడితే న్యాయం కోసం ఇంక ఎక్కడి వెళ్లాలని వాపోయాడు.
● అనీల్‌పై దాడిని వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యులు, వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తీవ్రంగా ఖండించారు. గ్రామాల్లో రెడ్‌బుక్ రాజ్యాంగం పేరుతో కార్యకర్తలను వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈమేరకు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఈపూరు పోలీసులపై ఫిర్యాదు చేశారు. కార్యకర్తలకు అండగా ఉంటానని భరోసాఇచ్చారు. న్యాయపరమైన పోరాటం చేసి కార్యకర్తలను కాపాడుకుంటామన్నారు.
అర్ధరాత్రి స్టేషనుకు పిలిపించి
తమదైన శైలిలో కౌన్సెలింగ్
సోషల్‌మీడియాలో పోస్టు పెట్టాడనే నెపంతో దారుణం
ఖండించిన మాజీ ఎమ్మెల్యే
బొల్లా బ్రహ్మనాయుడు