
మాజీ సైనికుల సంక్షేమం కోసం కృషి
జిల్లా సైనిక్ వెల్ఫేర్ అధికారి గుణశీల
వినుకొండ: వూజీసైనికుల సంక్షేమం కోసం కృషి చేస్తామని జిల్లా సైనిక్ వెల్ఫేర్ అధికారి ఆర్.గుణశీల వెల్లడించారు. శుక్రవారం మాజీసైనికుల సంక్షేమ కార్యాలయంలో మాజీ సైనికులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎక్స్‌సర్వీస్ మ్యాన్‌లకు రావాల్సిన సంక్షేమాలు అందించేందుకు చర్యలు చేపడతామని వివరించారు. అనంతరం మాజీ సైనికోద్యోగుల డిపెండెంట్స్‌కు గుర్తింపు కార్డులు అందించారు. వీరనారీలకు సంబంధించిన సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు కె.ఈశ్వరయ్య, సెక్రటరీ పాపిరెడ్డి, ట్రెజరర్ రాధాకృష్ణ, బి.బాలరాజు, కె.వెంకటేశ్వర రావు, జాస్తి రవిశంకర్‌లతోపాటు పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు.
పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్
పొన్నూరు: మండలంలోని పలు గ్రామాలకు సంబంధించిన నిధులను స్వాహా చేసిన గ్రేడ్– 3 పంచాయతీ కార్యదర్శి డి. వెంకటేశ్వరరావును సస్పెండ్ చేస్తూ జిల్లా పంచాయతీ అధికారి బి.వి.నాగ సాయికుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ములకుదురు గ్రామానికి సంబంధించి రూ. 76,963, మాచవరం రూ. 5,97,509, చింతలపూడి రూ.3,66,909 కలుపుకుని మొత్తం రూ. 10,41,381ను వెంకటేశ్వరరావు పంచాయతీలకు జమ చేయలేదు. దీనిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డెఫ్యూటీ మండల పరిషత్ అధికారిని ఆదేశించారు. రెవెన్యూ రికవరీ చట్టప్రకారం వసూలు చేసి, పంచాయతీలకు జమ చేసే విధంగా చర్యలు చేపట్టాలని జిల్లా పంచాయతీ అధికారి అందులో పేర్కొన్నారు.