
పీజీ వైద్యులకు పరిశోధనలపై దృష్టి ముఖ్యం
గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపల్ ఎన్. వెంకటసుందరాచారి
గుంటూరు మెడికల్: పీజీ వైద్య విద్యార్థులు అకడమిక్ కార్యక్రమాలతోపాటు పరిశోధనలపై దృష్టి సారించడం ద్వారా రోగులకు మెరుగైన సేవలు అందించవచ్చని గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపల్ నాగార్జునకొండ వెంకటసుందరాచారి అన్నారు. గుంటూరు మెడికల్ కాలేజ్‌లో పీజీ వైద్య విద్యార్థుల కోసం రెండురోజుల పరిశోధన శిక్షణ శిబిరం గురువారం మొదలైంది. తొలి ఏడాది పీజీ వైద్య విద్యార్థులకు ‘రీసెర్చ్ మెథడాలజీ – థీసిస్ ప్రిపరేషన్’పై కమ్యూనిటీ మెడిసిన్ విభాగం ఆధ్వర్యంలో వర్క్‌షాప్ నిర్వహించారు. వివిధ వైద్య విభాగాల నుంచి 180 మందికిపైగా పీజీ వైద్యులు పాల్గొన్నారు. వర్క్‌షాప్‌ను ప్రారంభించిన కమ్యూనిటీ మెడిసిన్ విభాగాధిపతి ప్రొఫెసర్ డాక్టర్ సీతారామ మాట్లాడుతూ, పరిశోధన పట్ల ఆసక్తిని పెంపొందించడానికి, గుణాత్మక థీసిస్ రూపొందించేందుకు వర్క్‌షాప్ ఉపయోగపడుతుందన్నారు. ముఖ్య అతిథిగా కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్.వి.సుందరాచారి మాట్లాడుతూ ఇలాంటి శిక్షణలు విద్యార్థులకు పరిశోధన పట్ల అవగాహనను పెంచడమే కాకుండా, మెరుగైన ఫలితాలు సాధించేందుకు దోహదపడతాయన్నారు. గైనకాలజీ ప్రొఫెసర్ డాక్టర్ జయంతి, డాక్టర్ పి.అనిల్, పలువురు అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు తరగతులు నిర్వహించి, పీజీ విద్యార్థుల థీసిస్ ప్రోటోకాల్‌ను వివరించారు.