
వైఎస్సార్ సీపీ అండగా ఉంటుంది
మంగళగిరి టౌన్: కూటమి నాయకుల్ని మెప్పించేందుకే పోలీస్ వ్యవస్థ పని చేస్తోందా ? అంటూ వైఎస్సార్ సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు ప్రశ్నించారు. గుంటూరు జిల్లా తాడికొండ మండలం కంతేరు గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ సభ్యురాలు కల్పన, సోషల్ మీడియా యాక్టివిటీ కర్రి విజయ భాస్కర్, మహిళా కార్యకర్త కర్రి మహాలక్ష్మి, ఆమె కుమారుడు నిఖిల్‌ను తాడికొండ పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు అరెస్ట్ చేసి, ఉదయం 11 గంటలకు కోర్టుకు హాజరుపరిచారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు, గుంటూరు నగర డెప్యూటీ మేయర్, తాడికొండ నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జి వనమా బాల వజ్రబాబు (డైమండ్ బాబు), మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి కోర్టు వద్దకు చేరుకున్నారు. అంబటి రాంబాబు మాట్లాడుతూ ఈనెల 25న చిన్నపిల్లలు గొడవ పడిన విషయాన్ని తీసుకువచ్చి, రాజకీయ ఒత్తిడితో కల్పన, మరికొందరిపై పోలీసుల తప్పుడు కేసు పెట్టారని విమర్శించారు. తెల్లవారుజామున 3 గంటలకు 30 పోలీసులు ఆమె నివాసంలోకి ప్రవేశించి అరెస్ట్ చేయడాన్ని ఖండించారు. పోలీసులు ఇచ్చిన రిమాండ్ రిపోర్ట్‌లో ఉదయం 6.30 గంటలకు అరెస్ట్ చేసినట్లు చూపించారని ఆరోపించారు. ఇలా పచ్చి అబద్ధాలు ఆడే పరిస్థితి, పోలీసులు దిగజారి పోవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని అంబటి ప్రశ్నించారు. కోర్టులో వాదనలు విన్న న్యాయమూర్తి ముద్దాయిలుగా ఉన్న నలుగురిని ప్రశ్నించగా, తెల్లవారుజామున 3.30 గంటలకు కి పోలీసులు వచ్చి తీసుకు వెళ్లారని చెప్పారని పేర్కొన్నారు. ఎఫ్‌ఐఆర్‌లో రాడ్లు, కర్రలతో కొట్టినట్లు ఉందని, అటెంటు మర్డర్ కింద కేసు నమోదు చేశారని తెలిపారు. కానీ ఎదుటి వారిపై ఎక్కడా గాయాలు గానీ, ఆసుపత్రిలో అడ్మిట్ కావడం గానీ, డాక్టర్ సర్టిఫికెట్లు గానీ పొందుపరచలేదని తెలిపారు. అయినా సరే న్యాయమూర్తి ముద్దాయిలను 14 రోజులు రిమాండ్‌కు పంపినట్లు తెలిపారు.
అక్రమ అరెస్ట్‌లకు గురైన ఎంపీటీసీ సభ్యురాలు కల్పనతో పాటు మరో ముగ్గురికి వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని గుంటూరు నగర డెప్యూటీ మేయర్, తాడికొండ నియోజకవర్గ ఇన్‌చార్జి వనమా వజ్రబాబు (డైమండ్ బాబు) అన్నారు. దీనిపై న్యాయపోరాటం చేస్తామని, తప్పుడు కేసులు పెట్టే వారిపై చర్యలు తీసుకునే విధంగా పార్టీ స్టాండ్ తీసుకుంటుందని తెలిపారు. ఏప్రిల్ 25న పిల్లలను కొట్టిన ఘటనపై పోలీస్‌స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేయకుండా, తరువాతి రోజు జరిగిన గొడవను అప్పటిప్పుడే హత్యాయత్నం కింద కేసు నమోదు చేయడం పలు అనుమానాలను రేకెత్తించే విధంగా ఉందని పేర్కొన్నారు.
హద్దులు మీరుతున్న పోలీసుల అరాచకాలు ఏకపక్షంగా వ్యవహరిస్తున్న పోలీసులు వైఎస్సార్‌సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు

వైఎస్సార్ సీపీ అండగా ఉంటుంది