
ముడిఖనిజం అక్రమ రవాణాపై ఫిర్యాదు
బొల్లాపల్లి: బండ్లమోటు మైనింగ్ నుంచి లెడ్, డోలమైట్ ముడి ఖనిజాలు అక్రమంగా తరలించి సమీపంలోని మాలపాడు పొలంలో అక్రమంగా నిల్వ ఉంచారని స్థానికంగా వచ్చిన ఫిర్యాదు మేరకు అటవీశాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆ శాఖ వినుకొండ రేంజ్ అధికారి సి.మాధవరావు ఆధ్వర్యంలో సిబ్బంది మంగళవారం రాత్రి 7 గంటల నుంచి 12 గంటల వరకు తనిఖీ చేపట్టారు. వివరాలు ఇలా ఉన్నాయి.. బండ్లమోటుకు చెందిన హిందుస్తాన్ లెడ్ జింక్ మైనింగ్ నుంచి ముడిఖనిజాలు ద్విచక్రవాహనంపై తరలించి సమీపంలోని మాలపాడు గ్రామానికి చెందిన ఒక రైతు పొలంలో అక్రమంగా నిల్వ ఉంచారని స్థానికులు కొందరు ఫిర్యాదు చేశారు. 2002 అక్టోబరులో బండ్లమోటు మైనింగ్ మూతపడింది. అప్పట్లో వేల టన్నుల లెడ్, డోలమైట్, ముడిఖనిజాల నిల్వలు బయట వదిలేశారు. ఇటీవల కాలంలో కొందరు ద్విచక్రవాహనాలపై అక్రమ మార్గంలో వీటిని తరలించి సమీపంలోని పొలంలో నిల్వ ఉంచారని స్థానికులు కొందరు మొబైల్ కెమెరాలో ఆ దృశ్యాలు తీసి జిల్లా ఫారెస్ట్ అధికారి, వినుకొండ రేంజ్ అధికారికి వాటిని పంపారు. ఈ మేరకు వినుకొండ రేంజ్ అధికారి గ్రామానికి చేరుకొని తనిఖీలు నిర్వహించారు. ఈ విషయంపై వినుకొండ రేంజ్ అధికారిని వివరణ అడగ్గా స్థానికులు ఫొటోలు తీసి పంపారని, వారి ఫిర్యాదు మేరకు తనిఖీ నిర్వహించామన్నారు. తనిఖీలో ఆ ప్రదేశంలో ఎటువంటి ముడి ఖనిజ నిల్వలు వెలుగు చూడలేదని రేంజ్ అధికారి తెలిపారు. పూర్తిస్థాయి విచారణ చేపట్టామని ఒకటి రెండు రోజుల్లో దీనిపై పూర్తి వివరాలు వెల్లడిస్తామని రేంజ్ అధికారి తెలిపారు. అయితే ఫారెస్ట్ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ప్రయోజనం లేదని, తూతూ మంత్రంగా, నామమాత్రంగా తనిఖీలు నిర్వహించి చేతులెత్తేశారని స్థానికులు చెబుతున్నారు.
తనిఖీలు నిర్వహించిన అటవీశాఖ అధికారులు