
లక్ష టన్నుల సేకరణ తర్వాతనే బయటకు
నరసరావుపేట: జిల్లాలో ఉన్న ఇసుక రీచ్‌ల ద్వారా లక్ష టన్నుల సేకరణ అనంతరమే బయటకు వెళ్లాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో ఎనిమిదో జిల్లా స్థాయి శాండ్ కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం సుమారు 60వేల టన్నుల ఇసుక మల్లాది, కోనూరు స్టాక్ యార్డులలో అందుబాటులో ఉందన్నారు. రీచ్‌ల నుంచి స్టాకు పాయింట్ల వరకు ఇసుక రవాణాకు టన్నుకు చెల్లించే పైకంపై సత్వరమే నిర్ధారణ చేయాలని జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే, జిల్లా మైన్స్ గనుల శాఖాధికారి నాగినిని ఆదేశించారు. చిలకలూరిపేట, వినుకొండ, మాచర్ల వద్ద స్టాక్ యార్డుల ఏర్పాటుకు స్థల సేకరణకు అవసరమైన చర్యలు తీసుకోవాలాన్నారు. తంగెడ, పొందుగల, విజయపురి సౌత్ వద్ద ఉన్న ఇసుక పాయింట్‌ల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. ఇసుక స్టాక్ యార్డుల వద్ద రాత్రిపూట వాచ్‌మెన్‌లను ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని తెలిపారు. అడిషనల్ ఎస్పీ జేవీ సంతోష్, సత్తెనపల్లి రెవెన్యూ డివిజనల్ అధికారి రమాకాంత్‌రెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.