
ట్రాక్టర్ కింద పడి బాలిక దుర్మరణం
బెల్లంకొండ: ట్రాక్టర్ కింద పడి బాలిక మృతి చెందిన ఘటన మండలంలోని న్యూ చిట్యాల సమీపంలో మంగళవారం చోటుచేసుకుంది. ఈ ఘటనలో న్యూ చిట్యాలకు చెందిన అడావత్ సంధ్య భాయి (13) అనే బాలిక అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. న్యూ చిట్యాలకు చెందిన సంధ్య భాయి మంచినీళ్ల కోసం బంధువుల బైక్‌పై బెల్లంకొండలోని వాటర్ ప్లాంట్ వద్దకు వెళ్తుంది. కాగా కొండ సమీపంలోకి రాగానే బెల్లంకొండ నుంచి మన్నెసుల్తాన్‌పాలెం వైపు వెళ్తున్న మరో బైక్ వీరిని ఢీకొంది. ఈ క్రమంలో సంధ్య భాయి బైక్ పై నుంచి రోడ్డు మీద పడిపోయింది. ఈ క్రమంలో వారి వెనకగా వేగంగా వస్తున్న ట్రాక్టర్ సంధ్య భాయిని తొక్కుకుంటూ వెళ్లింది. దీంతో తీవ్రంగా గాయపడిన బాలిక అక్కడికక్కడే మృతి చెందిందని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు పూర్తి వివరాలు సేకరించి కేసు నమోదు చేస్తున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు. కాగా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సత్తెనపల్లి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.