
ప్చ్.. లాభం లేదు!
జిల్లాలో జనసేన నేతల అంతర్మథనం
అధికారం వస్తే అందరూ సమానమన్నారు.. కానీ ఆ అందరికంటే వెనక్కి నెట్టారు. పల్లకి మోస్తే పదవులు ఇస్తామన్నారు. పదవులన్నీ వాళ్లే తీసుకొని పాలెగాళ్లను చేశారు. అందరి జెండాలు భుజాన వేసుకుంటే వెన్ను తట్టి నిలుస్తామన్నారు. చివరకు మీరే గుదిబండ అయ్యారంటూ భుజం పట్టి పక్కకి నెట్టారు. అధికారంలో ఉన్నామో, ప్రతిపక్షంలో కూర్చున్నామో అర్థంగాక, ఎక్కడా గౌరవం దక్కక పల్నాడు జిల్లా జనసేన నేతలు గుండె మంటతో రగిలిపోతున్నారు. తమ బాధను ఎవరికి చెప్పుకోవాలో తెలియని అయోమయంలో ఉన్నారు.
సాక్షి, నరసరావుపేట: అధికార కూటమిలో ఉన్నామన్న మాట తప్ప తమకు పావలా ఉపయోగం లేదన్న నిరాశలో పల్నాడు జిల్లా జనసేన నేతలున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావొస్తున్నా జిల్లాలో ఒక్కరికంటే ఒక్కరికి కూడా నామినేటెడ్ పదవి దక్కలేదన్న నిరాశ, నిస్పృహలో ఉన్నారు. పోనీ పదవులు లేకపోయినా పెత్తనమన్నా దక్కిందా అంటే అది కూడా లేదని వారు వాపోతున్నారట. తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలే జిల్లాలో అధికార పెత్తనం మొత్తం చెలాయిస్తున్నారు. ప్రజాధనాన్ని దోపిడిలోనూ వారిదే పై చేయి. కూటమి అధికారంలోకి రావడానికి ఎంతో కీలకమైన మాకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్న భావన జనసేన నేతలు, కార్యకర్తలలో ఉంది. దీనిపై ఇప్పటికే జిల్లాకు చెందిన పలువురు జనసేన నేతలు ఆ పార్టీ అధిష్టానానికి ఫిర్యాదులు చేశారు. అయినా ఉపయోగం లేదన్న భావన వారిలో ఉంది. అధిష్టానం కేవలం గోదావరి జిల్లాల నేతలకు పదవులు, పెత్తనం సాధించే పనిలో ఉందని, మాకు గురించి ఆలోచించే తీరిక కూడా లేదంటున్నారు.
హామీలు.. నీటిపై రాతలు!
సార్వత్రిక ఎన్నికల ముందు జనసేన జిల్లా నేతలతో పనిచేయించుకోవడానికి జనసేన, టీడీపీ ముఖ్యనేతలు హామిలిచ్చారు. అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను గాలికి వదిలేశారు. సత్తెనపల్లి అసెంబ్లీ టికెట్ ఆశించిన బొర్రా వెంకట అప్పారావు ఎన్నికల ముందు నుంచే నియోజకవర్గంలో పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చుపెట్టి పార్టీ తరఫున కార్యక్రమాలు నిర్వహించారు. పొత్తులో భాగంగా జిల్లాలో ఒక్క సీటు అయినా జనసేనకు కేటాయిస్తారని అది సత్తెనపల్లే ఉంటుందని ఆయన వర్గం బాగా ప్రచారం చేసింది. తీరా చూస్తే కూటమి తరఫున ఎమ్మెల్యే సీటు కన్నా లక్ష్మీనారాయణకు కేటాయించారు. దీంతో బొర్రా స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు. వెంటనే రంగంలోకి దిగిన జనసేన, టీడీపీ ముఖ్యనేతలు అప్పారావును బుజ్జగించి నామినేషన్ ఉపసంహరించుకొనేలా చేశారు. అధికారంలోకి రాగానే మంచి నామినేటెడ్ పదవి అప్పగించి ప్రభుత్వంలో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారని, ఏడాదైనా అతిగతీ లేదని ఆయన వర్గం తీవ్ర నిరాశలో ఉంది.
● అదే విధంగా నరసరావుపేట నియోజకవర్గ ఇన్‌చార్జి సయ్యద్ జిలానీ జనసేన జెండాతో 2019 ఎన్నికల్లో పోటీ చేసి భారీగా ఖర్చు పెట్టి పార్టీ ఉనికి కోసం పోరాడాడు. తన సొంత గ్రామం పమిడిపాడులో ఆ పార్టీ తరఫున అభ్యర్థిని నెలబెట్టి సర్పంచ్‌గా గెలిపించుకున్నాడు. 2024 ఎన్నికల వరకు కూడా నియోజకవర్గంలో జనసేన పార్టీ కార్యక్రమాలను అన్ని తానై నిర్వహించారు. నరసరావుపేట ఎమ్మెల్యే టికెట్ నీదేనంటూ చివరి వరకు అధిష్టానం చెబుతూ వచ్చి, తీరా టీడీపీ అభ్యర్థికే కూటమి తరఫున బీఫాం ఇచ్చారు. ఆసమయంలో జిలానీ అలగడంతో అధికారంలోకి వచ్చాక మైనార్టీ కోటాలో పదవితోపాటు మంచి గుర్తింపు ఉంటుందని అధిష్టానం హామీఇచ్చింది. తీరా చూస్తే ఏడాదిగా పదవి రాకపోగా ప్రభుత్వ కార్యక్రమాల్లో ఏమాత్రం గుర్తింపు దక్కడం లేదు.
● వినుకొండ జనసేన నేత నిస్సంక శ్రీనివాసరావుది దాదాపుగా ఇదే పరిస్థితి. స్థానిక ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు తనను పట్టించుకోలేదన్న ఆవేదన ఆయనలో ఉందట. జనసేనకు గట్టి పట్టున్న సామాజిక వర్గం అధికంగా ఉండే పెదకూరపాడు, గురజాల, చిలకలూరిపేటలలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అక్కడి జనసేన నేతలకు ప్రభుత్వ కార్యాలయాలలో ఏమాత్రం గౌరవం దక్కడం లేదన్న భావన వారిలో ఉంది.
నామినేటెడ్ పదవుల్లో జిల్లా జనసేన నేతలకు ఒక్కటీ దక్కని వైనం పదవులన్నీ గోదావరి జిల్లా నేతలకే ఇస్తే మా పరిస్థితి ఏంటంటూ ఆవేదన అధిష్టానం తమ గురించి పట్టించుకోవడం లేదని అసంతృప్తి నామినేషన్ ఉపసంహరిస్తే నామినేటెడ్ పదవి ఇస్తామని ఎన్నికల సమయంలో సత్తెనపల్లి నేత బొర్రా అప్పారావుకు హామీ నరసరావుపేట ఎమ్మెల్యే సీటు దక్కనందుకు జిలానికీ పదవి ఆఫర్ ఏడాది కావొస్తున్నా దక్కని పదవులు రెవెన్యూ, పోలీసు కార్యాలయాల్లోనూ మాట నెగ్గడం లేదని గగ్గోలు బెల్టుషాపులు, రేషన్, ఇసుక దందాల్లో వాటాలు కావాలంటూ డిమాండ్
ఇటీవల ప్రకటించిన నామినేటెడ్ పదవుల్లో జనసేన నేతలకు ప్రాధా న్యం ఇవ్వకపోగా, కనీసం ఏదైనా కేసు విషయమై పోలీస్ స్టేషన్‌కి వెళ్తే కనీస మర్యాద ఇవ్వడం లేదంటూ నేతలు ఆవేదన చెందుతున్నారు. భూసమస్యల నిమిత్తం రెవెన్యూ కార్యాలయా లకు వెళితే టీడీపీ మండల స్థాయి నేతల సిఫార్సు కావాలని అధికారులు చెబుతుండటం జనసేన నేతలకు మింగుడుపడటం లేదు. కూటమి అధికారంలో వచ్చిన తరువాత రేషన్ బియ్యం అక్రమ రవాణా, బెల్టుషాపులు, లిక్కర్ టెండర్లు, మైనింగ్ వంటి ఆదాయం వచ్చే ప్రతి విషయంలో టీడీపీ నాయ కులు ముందు వరుసలో ఉంటూ జేబులు నింపుకొంటున్నా రు. తమకు మాత్రం రిక్తహస్తమే దక్కుతోందని ఆవేదనలో ఉన్నారు. తమ దుస్థితిపై పార్టీలో ఎవరికి చెప్పుకోవాలో తెలియక అయోమయంలో ఉన్నామని వారు చెప్పుకొస్తున్నారు. తమ అధినేత వపన్ కల్యాణ్ స్వప్రయోజనాలు తప్ప క్యాడర్ గురించి, పార్టీ భవిష్యత్తు గురించి ఆలోచించడం లేదని కార్యకర్తలు పెదవి విరుస్తున్నారు.

ప్చ్.. లాభం లేదు!