
సమస్యలు పరిష్కరించకుంటే పెద్దఎత్తున ఉద్యమిస్తాం
ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మక్కెన శ్రీనివాసరావు
సత్తెనపల్లి: విద్యారంగ సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మక్కెన శ్రీనివాసరావు అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో అసంబద్ద విధానాలకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు సోమవారం పల్నాడు జిల్లా సత్తెనపల్లి డివిజన్ కేంద్రంలో ఏపీటీఎఫ్ పల్నాడు జిల్లా కార్యదర్శి షేక్ మహమ్మద్ ఇబ్రహీం ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర కార్యదర్శి మక్కెన శ్రీనివాసరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం జీఓ 117 రద్దు చేసి ఉన్నత పాఠశాలలనుంచి 3,4,5 తరగతులు వెనక్కి తీసుకువస్తామని హామీ ఇచ్చి అమలు చేయకపోగా నేడు అదనంగా 1,2 తరగతులను కూడా ఉన్నత పాఠశాలలోకి కలపడం మోసం చేయడమేనన్నారు. ప్రపంచ బ్యాంకు ఒత్తిడులకు తలొగ్గి ప్రభుత్వం పాఠశాల వ్యవస్థను విధ్వంసం చేసే పనులు కొనసాగిస్తుందన్నారు. యువగళం పాదయాత్రలో లోకేష్ ఇచ్చిన హామీ మేరకు 1 నుంచి 5 తరగతులు ప్రాథమిక పాఠశాలలోను, 6 నుంచి 10 లేక 12 తరగతులు ఉన్నత పాఠశాలల్లో ఉండేటట్లు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా ప్రతి ప్రాథమిక పాఠశాలకు ఇద్దరు ఎస్జీటీలను ఇవ్వాలని, విద్యార్థుల సంఖ్య పెరిగేకొద్దీ ఉపాధ్యాయులను అదనంగా కేటాయించాలని డిమాండ్ చేశారు. విద్యా రంగ, ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అసంబద్ధ నిర్ణయాలు కొనసాగిస్తే ఈ నెల 9న అన్ని జిల్లా కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు నిర్వహిస్తామని, అప్పటికీ పరిష్కారం కాకపోతే 14వ తేదీన విజయవాడలో పెద్దఎత్తున మహా ధర్నా చేపడతామని హెచ్చరించారు. జిల్లా కార్యదర్శి షేక్ మహమ్మద్ ఇబ్రహీం మాట్లాడుతూ 12వ పీఆర్సీ కమిషన్ నియమించి, కరువు భత్యం 30 శాతం ప్రకటించాలని డిమాండ్ చేశారు. నిరసన ప్రదర్శన అనంతరం తహసీల్దార్ చక్రవర్తికి వినతి పత్రం అందించారు. ఏపీటీఎఫ్ నిరసన ప్రదర్శనకు సంఘీభావంగా ఏపీ ఎన్జీఓ సత్తెనపల్లి యూనిట్ సెక్రటరీ అంబేడ్కర్, ట్రెజరీ అసోసియేషన్ నాయకులు ఇబ్రహీం పాల్గొన్నారు. కార్యాక్రమంలో ఏపీటీఎఫ్ జిల్లా కార్యదర్శి డి.శ్రీనివాసరావు, తాలూకా పరిధిలోని వివిధ మండలాల ఏపీటీఎఫ్ నాయకులు ధర్మారావు, హఫీజ్, ఐతమ్‌రాజు, అత్తరున్నీస, తులసి, భావనాఋషి, చంద్రం, పియం రమేష్ తదితరులు పాల్గొన్నారు.