
నిందితులకు కొమ్ము కాయటం ఘోరం
నరసరావుపేట: శావల్యాపురం మండలం గంటవారిపాలెంలో కుంభా యోగయ్య షాపులను కూల్చిన నిందితులపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి షాపులు కూల్చివేతకు ఉపయోగించిన పొక్లెయిన్‌ను సీజ్ చేయాలని కుల నిర్మూలన పోరాట సమితి (కేఎన్‌పీఎస్) రాష్ట్ర కార్యదర్శి కె.కృష్ణ డిమాండ్ చేశారు. ఎన్నికల ఫలితాలు అనంతరం పల్నాడు జిల్లాలో రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న పోలీస్, రెవెన్యూ ఉన్నతాధికారుల టీడీపీ అనుకూల చర్యలను నిరసిస్తూ దళిత, గిరిజన ప్రజాసంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్, ఎస్పీ కార్యాలయాల్లో నిర్వహిస్తున్న పీజీఆర్‌ఎస్‌లో చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రాలు సమర్పించారు. కృష్ణ మాట్లాడుతూ గ్రామ శివారు ఎరుకలవాడలో గత నెల 19న ఎరుకల కులస్తులైన కుంభా యోగయ్య చికెన్, కిరాణా షాపులను ఆ గ్రామ టీడీపీ నాయకులు వెంకట్రావు, మురళి, మధుసూదనరావు, రామకృష్ణ, వెంకట హరినరసింహారావులు పొక్లెయిన్‌తో కూల్చడాన్ని తీవ్రంగా ఖండించారు. షాపుల కూల్చివేతను అడ్డుకున్న పులి నాగేశ్వరరావుపై విచక్షణారహితంగా దాడి చేస్తున్న సమయంలో ఆ దాడి దృశ్యాలను సెల్‌ఫోన్‌లో వీడియో తీస్తున్న కుంభా సుజాతను కులం పేరుతో మధుసూధనరావు దూషించడమే కాకుండా ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారన్నారు. ఇంతటి దారుణమైన సంఘటన జరిగినా స్థానిక ఎస్‌ఐ, తహసీల్దార్ మొదలు జిల్లా కలెక్టర్, ఎస్పీ వరకు గ్రామాన్ని సందర్శించి బాధితులకు భరోసా ఇవ్వకపోవటం దారుణమన్నారు. అధికారులు అధికార టీడీపీ కూటమి కార్యకర్తలుగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆధిపత్య శక్తులనుంచి బాధితులకు రక్షణ కల్పించడంతోపాటు రూ.18 లక్షలు నష్టపరిహారాన్ని చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. సంఘటనపై నిజాయితీ కలిగిన డీఎస్పీతో కేసు విచారణ చేయించి దోషులకు శిక్షలు పడేలా తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ధర్నాలో జిల్లా ప్రగతిశీల కార్మిక సమాఖ్య కమిటీ సభ్యుడు కంబాల ఏడుకొండలు, ఎమ్మార్పీఎస్ నాయకుడు ప్రసన్న కుమార్, బీసీ సంఘ నాయకుడు బాదుగున్నల శ్రీనివాసరావు, ఓర్సు శ్రీనివాసరావు, జక్కా బ్రహ్మయ్య, కేఎన్‌పీఎస్ నాయకుడు చలంచర్ల అంజి పాల్గొన్నారు.
గంటావారిపాలెం ఘటనలో నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలి బాధితులకు రూ.18లక్షలు నష్టపరిహారం చెల్లించాలి కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేసిన దళిత, గిరిజన ఐక్యవేదిక నాయకులు