
సీహెచ్‌ఓల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి
ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి
నరసరావుపేట: కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల (సీహెచ్‌ఓ) ను వెంటనే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వారి న్యాయమైన డిమాండ్లను కూటమి ప్రభుత్వం నెరవేర్చాలని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. ఏపీ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టణంలో గత ఎనిమిది రోజులుగా నిరసన తెలియజేస్తున్న సీహెచ్‌ఓల దీక్షా శిబిరాన్ని సోమవారం సందర్శించి వారికి వైఎస్సార్ సీపీ తరఫున సంఘీభావం తెలిపారు. జిల్లా అధ్యక్షురాలు అనుపమ ద్వారా డిమాండ్ల తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆయుష్మాన్ భారత్ తరపున విలేజ్ హెల్త్ సెంటర్లలో పనిచేస్తున్న సీహెచ్‌ఓలు తమ న్యాయమైన కోరికల సాధన కొరకు సమ్మె చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారని అన్నారు. కానీ కూటమి ప్రభుత్వం తరఫున కనీస స్పందన కూడా లేదని, వీరి న్యాయబద్ధమైన కోరికలు తీర్చమని అడుగుతుంటే, ఈ ప్రభుత్వంలో వినే నాథుడే లేడని అన్నారు. రెండు రోజుల క్రితం వీరి బాధలు చెప్పుకోవడానికి ఆరోగ్యశాఖ మంత్రిని కలిస్తే మీకు ఏం చేయమని, మీకు దిక్కున చోట చెప్పుకోండని సమాధానం చెప్పటం చాలా బాధాకరమైన విషయమని అన్నారు. వీరందరూ బీఎస్సీ, ఎమ్మెస్సీ నర్సింగ్ కోర్సులు పూర్తిచేసి సెలక్షన్ ప్యానల్ కమిటీ ద్వారా రిక్రూట్ అయ్యారని, వీరిని తక్షణమే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. నిబంధనల ప్రకారం ఆరేళ్ల సర్వీసు పూర్తి చేసిన అందరిని తక్షణమే రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తున్నామని వెల్లడించారు. వైఎస్సార్‌సీపీ జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు అన్నెం పున్నారెడ్డి, ఎస్టీ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ పాలపర్తి వెంకటేశ్వరరావు, పార్టీ నాయకుడు షేక్ కరీముల్లా, సామాజిక విశ్లేషకులు ఈదర గోపీచంద్ పాల్గొన్నారు.