
వైభవంగా నాటికల పోటీలు ప్రారంభం
తెనాలి: రూరల్ మండల గ్రామం కొలకలూరులో కొలంకపురి నాటక కళాపరిషత్, శ్రీసాయి ఆర్ట్స్, కొలకలూరు సంయుక్త నిర్వహణలో ఉభయ రాష్ట్రస్థాయి 11వ ఆహ్వాన నాటికల పోటీలు శుక్రవారం రాత్రి వైభవంగా ఆరంభమయ్యాయి. గ్రామంలోని చిన్న రథశాల వద్ద ప్రత్యేక వేదిక గద్దె శివరావు కళాప్రాంగణంలో ఏర్పాటైన నాటికల పోటీలను కళాపరిషత్ గౌరవ అధ్యక్షుడు వైఎస్‌కేఎన్ స్వామి, ఉపాధ్యక్షుడు సుద్దపల్లి మురళీధర్, ప్రముఖ నాటక రచయిత వల్లూరు శివప్రసాద్ జ్యోతిప్రజ్వలనతో ఆరంభించారు. సభకు పొన్నూరు కళాపరిషత్ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఆకుల సాంబశివరావు అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా ప్రముఖ సినీ మాటల రచయిత డాక్టర్ సాయిమాధవ్ బుర్రా మాట్లాడుతూ.. ఆంధ్రాప్యారిస్ తెనాలి కళల కాణాచిగా వర్ధిల్లితే, ఎందరో కళాకారులకు జన్మనిచ్చిన పుణ్యభూమి కొలకలూరు అని చెప్పారు. వల్లూరు వెంకట్రామయ్య, మోదుకూరి జాన్సన్, డీఎస్ దీక్షిత్ వంటి నాటకరంగ ప్రముఖులు, ఎందరో సాహితీవేత్తలు కొలకలూరు నుంచి ఉద్భవించారని సోదాహరణంగా చెప్పారు. ఏటా నాటికల పోటీలను నిర్వహిస్తూ, సంస్థ అభివృద్ధికి తోడ్పడిన నాటకరంగ ప్రముఖుల పేరుతో అవార్డులను ప్రదానం చేస్తున్న శ్రీసాయి ఆర్ట్స్ సంస్థ నిర్వాహకులు అభినందనీయులని చెప్పారు. ఇదే వేదికపై తాడేపల్లికి చెందిన ప్రముఖ రంగస్థల నటుడు, దర్శకుడు, నాటక సంస్థ నిర్వాహకుడు గంగోత్రి సాయికి నటుడు, దర్శకుడు కరణం సురేష్ జ్ఞాపకార్థం ప్రదానం చేసి సవ్యసాచి అవార్డును బహూకరించారు. ప్రముఖ సంగీత దర్శకుడు తుమ్మల సాంబశివరావు స్మారకంగా మరో సంగీత దర్శకుడు పి.లీలామోహనరావును సత్కరించారు. వరగాని పరిషత్ అధ్యక్షుడు పోపూరి నాగేశ్వరరావు, ఎన్టీఆర్ కళాపరిషత్, అనంతవరం అధ్యక్షుడు గుదె పాండురంగారావు, కొండవీటి కళాపరిషత్, లింగారావుపాలెం అధ్యక్షుడు కట్టా శ్రీహరి, ఎన్టీఆర్ కళాపరిషత్, వినుకొండ అధ్యక్షుడు కూచి రామాంజనేయులు, కళాంజలి, చీరాల కార్యదర్శి తిరుమలశెట్టి సాంబశివరావు మాట్లాడారు. నిర్వాహక సంస్థల అధినేతలు, రంగస్థల, సినీ నటులు గోపరాజు రమణ, గోపరాజు విజయ్, పాలకవర్గ సభ్యులు పర్యవేక్షించారు.

వైభవంగా నాటికల పోటీలు ప్రారంభం