అభివృద్ధి ప్రదాత కాసు వెంగళరెడ్డి | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధి ప్రదాత కాసు వెంగళరెడ్డి

May 2 2025 1:36 AM | Updated on May 2 2025 1:36 AM

అభివృద్ధి ప్రదాత కాసు వెంగళరెడ్డి

అభివృద్ధి ప్రదాత కాసు వెంగళరెడ్డి

నరసరావుపేట: సర్దార్‌ కాసు వెంగళరెడ్డి ఉమ్మడి గుంటూరు జిల్లా అభివృద్ధికి గుండెకాయలాగా పనిచేశారని మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కాసు మహేష్‌రెడ్డి పేర్కొన్నారు. వెంగళరెడ్డి 45వ వర్ధంతి సందర్భంగా గురువారం పల్నాడురోడ్డులోని ఎస్‌ఎస్‌ఎన్‌ కళాశాలకు ఎదురుగా ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. డాక్టర్‌ గోపిరెడ్డి మాట్లాడుతూ వెంగళరెడ్డి అందరి కష్టసుఖాల్లో పాలుపంచుకున్నారన్నారు. రాజ్యసభ సభ్యులుగా, శాసనసమండలి సభ్యునిగాను, డీసీసీబీ, జిల్లా పరిషత్‌ చైర్మన్‌గా సమర్థవంతంగా పనిచేశారన్నారు. ఎంతోమందికి ఉద్యోగ, ఉపాధి అవవకాశాలు కల్పించారన్నారు. మాజీ మంత్రి కాసు వెంకటకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మహేష్‌రెడ్డి ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నారన్నారు. కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేసి రాష్ట్రాభివృద్ధికి విశేష కృషి చేశారన్నారు.

రాష్ట్ర చరిత్రలో చెరగని ముద్ర

కాసు మహేష్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో కాసు బ్రహ్మానందరెడ్డి, వెంగళరెడ్డి చెరగని ముద్ర వేశారన్నారు. నాగార్జునసాగర్‌ నిర్మాణంలో బ్రహ్మానందరెడ్డి కీలకపాత్ర పోషించి క్రస్టుగేట్లు ఏర్పాటు చేయించి గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో లక్షలాది ఎకరాలకు సాగునీరు, లక్షలమందికి తాగునీరు అందించి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేశారన్నారు. వెంగళరెడ్డి జిల్లా పరిషత్‌ చైర్మన్‌గా జిల్లాలో అనేక ప్రాంతాల్లో స్కూళ్లు ఏర్పాటు చేయించారన్నారు. తొలుత క్యాంపు కార్యాలయంలో కాసు మహేష్‌రెడ్డి వెంగళరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. వైఎస్సార్‌ సీపీ సత్తెనపల్లి సమన్వయకర్త డాక్టర్‌ గజ్జల సుధీర్‌ భార్గవరెడ్డి, మాజీ సర్పంచ్‌ పొన్నపాటి ఈశ్వరరెడ్డి మాట్లాడారు. సీనియర్‌ నాయకుడు డాక్టర్‌ గజ్జల బ్రహ్మారెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు పదముత్తం చిట్టిబాబు, పార్టీ జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు అన్నెం పున్నారెడ్డి, నకరికల్లు మండల కన్వీనర్‌ భవనం రాఘవరెడ్డి, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఘనంగా నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్‌ గోపిరెడ్డి, కాసు మహేష్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement