
గిట్టుబాటు కోసం పోరుబాట
చిలకలూరిపేట: బర్లీ పొగాకు రైతుల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, వెంటనే మద్దతు ధర కల్పించలాని పలు రైతు సంఘాలు, వివిధ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు ఆరోపించారు. బర్లీ పొగాకు పండించిన రైతులకు గత ఏడాది మాదిరిగా ధర చెల్లించి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ... పొగాకు రైతులకు న్యాయమైన మద్దతు ధర లభించేలా చూడాలన్నారు. దీంతో ఎగుమతులను ప్రోత్సహించడం కూడా పొగాకు బోర్డు ప్రాథమిక కర్తవ్యమని తెలిపారు. కానీ వర్జీనియా పొగాకును మాత్రమే పట్టించుకుంటోందని మండిపడ్డారు. బర్లీ పొగాకు, నాటు పొగాకు తమ పరిధిలో లేవంటూ బాధ్యతల నుంచి తప్పుకొంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
పత్తాలేని ప్రైవేటు సంస్థలు
గతేడాది పొగాకుకు ఏర్పడిన డిమాండ్‌తో ఈ ఏడాది సీజన్ మొదట్లో పలు కంపెనీలు రైతులను ప్రోత్సహించడంతో ఎక్కువమంది బర్లీ పొగాకు సాగు చేశారని వెల్లడించారు. ఎకరాకు రూ.లక్షన్నరకుపైగా ఖర్చు చేసి రైతులు, అదనంగా మరో రూ.40 వేలు కౌలు వెచ్చించి మరికొందరు సాగు చేశారన్నారు. పంట చేతికొచ్చే సమయానికి గిట్టుబాటు ధర లేకపోవడంతో తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. విత్తనాలు ఇచ్చిన ప్రైవేట్ కంపెనీలు పత్తాలేకుండా పోవడం, ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. దళారులు మద్దతు ధరను పదేపదే మార్చకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. బర్లీ పొగాకును టుబాకో బోర్డు పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. పర్చూరు పర్యటనకు వచ్చిన సీఎం చంద్రబాబు బర్లీ పొగాకు రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చినా నెరవేరలేదన్నారు. అనంతరం తహసీల్దార్ మొహమ్మద్ హుస్సేన్‌కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో సీపీఐ ఏరియా ఇన్‌చార్జి కార్యదర్శి తాళ్లూరి బాబురావు, నల్లమడ రైతు సంఘం కన్వీనర్ డాక్టర్ కొల్లా రాజమోహనరావు, సీఐటీయూ పల్నాడు జిల్లా కన్వీనర్ పేరుబోయిన వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి ఎం.రాధాకృష్ణ, సీపీఐ పట్టణ కార్యదర్శి పేలూరి రామారావు, జన క్రాంతి పార్టీ నాయకులు షేక్ గౌస్, వీసీకే నాయకులు వంజా ముత్తయ్య, నేతలు బి. శ్రీనునాయక్, నసీరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.