కడచూపునకు వస్తూ కడతేరే.. | - | Sakshi
Sakshi News home page

కడచూపునకు వస్తూ కడతేరే..

Apr 15 2025 1:35 AM | Updated on Apr 15 2025 1:35 AM

కడచూపునకు వస్తూ కడతేరే..

కడచూపునకు వస్తూ కడతేరే..

యడ్లపాడు: నాయనమ్మ మరణించిందని తెలిసి కడచూపుకు వస్తున్న యువకుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. ఈ హృదయ విదారక ఘటన యడ్లపాడు మండలంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. చిలకలూరిపేట పోలిరెడ్డిపాలెం ఎదురుగా ఉన్న లక్ష్మీనర్సింహకాలనీకి చెందిన మక్కెన శ్రీనివాసరావు దంపతులకు ఇద్దరు కుమారులు. వీరిలో చిన్నవాడైన శివరామకృష్ణ(28)కి ఏడాదిన్నరక్రితం సమీప బంధువు నందినితో పెళ్లయింది. శివరామకృష్ణ విజయవాడలోనే ఉంటూ ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఆదివారం చిలకలూరిపేట రూరల్‌ మండలం అప్పాపురం గ్రామంలో ఉన్న నాయనమ్మ సుబ్బలమ్మ చనిపోయిందన్న వార్త తెలిసి చూసేందుకు బైక్‌పై బయలుదేరాడు. యడ్లపాడు గ్రామంలోని ఎన్‌ఎస్‌ఎల్‌ నూలుమిల్లు వద్ద ఫ్లై ఓవర్‌ వద్దకు రాగానే ఎదురుగా వెళ్తున్న వాహనం సడన్‌ బ్రేక్‌ వేయడంతో బైక్‌ అదుపు తప్పి ఆ వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో శివరామకృష్ణకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో కుటుంబసభ్యులు శివరామకృష్ణను విజయవాడ సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం అతను మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అయితే సుబ్బులమ్మ భౌతికకాయాన్ని చూసేందుకు తరలివచ్చిన బంధుమిత్రులు సోమవారం ఉదయం ఆమెకు అప్పాపురం గ్రామంలోనే అంత్యక్రియలు నిర్వహించారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన శివరామకృష్ణ భౌతికకాయానికి పోలీసులు పోస్టుమార్టం నిర్వహించి సోమవారం సాయంత్రం కుటుంబ సభ్యులకు అప్పగించారు. దీంతో అప్పాపురం వచ్చిన బంధుమిత్రులంతా చిలకలూరిపేట లక్ష్మీనర్సింహకాలనీకి తీసుకువచ్చిన శివరామకృష్ణ భౌతికకాయాన్ని సందర్శించి పట్టణంలోని ఏఎంజీ సమీపంలోని శ్మశాన వాటిలో ఖననం చేశారు. ఒకే కుటుంబంలోని ఇద్దరు వెనువెంటనే మృతి చెందడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి.

రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం నానమ్మ మరణ వార్త విని వస్తుండగా దుర్ఘటన శోకసముద్రంలో మునిగిన కుటుంబం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement