నల్లబర్లీ పొగాకు వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్
జే.పంగులూరు: నల్లబర్లీ పొగాకు వెంటనే కొనుగోలు చేయాలని రైతు సంఘం, కౌలు రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. ప్రైవేటు కంపెనీలు నల్లబర్లీ పొగాకు కొనుగోలు చేయకపోవడం.. ప్రభుత్వం కూడా రైతులను పట్టించుకోకపోవడంతో నిరసనగా పంగులూరు బస్టాండ్ సెంటర్‌లో సోమవారం రైతులు పొగాకు పంటను తగులబెట్టి నిరసరన తెలిపారు. రైతు సంఘం బాపట్ల జిల్లా కార్యదర్శి తలపనేని రామారావు మాట్లాడుతూ నల్లబర్లీ కొనుగోలు చేస్తాం సాగు చేయండని రైతులను ప్రొత్సహించి సాగుచేయించిన ప్రైవేటు కంపెనీలు ఇప్పుడు మొహం చాటేశాయని, కొనుగోలు చేసేందుకు ముందుకు రావడం లేదన్నారు. లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టి రైతులు, కౌలు రైతులు సాగు చేస్తే కంపెనీలు కొనుగోలు చేయకపోవడం దారుణమన్నారు.
నిమ్మకు నీరెత్తినట్లుగా కూటమి ప్రభుత్వం
నల్లబర్లీ పొగాకును కొనుగోలు చేయకుండా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తిన్నట్లు ఉందన్నారు. గత సంవత్సరం పొగాకు పంట లాభాలు దృష్ట్యా రైతులు ఎక్కువగా ఆ పంట వేసేందుకు మక్కువ చూపారని, బాపట్ల జిల్లాలోని పర్చూరు, అద్దంకి నియోజకవర్గాల పరిధిలో లక్షల ఎకరాల్లో సాగు చేశారన్నారు. దానికి తోడు నల్లబర్లీ ఎక్కువగా సాగు చేశారని అన్నారు. బర్లీ పొగాకును కూడా బోర్డు పరిధిలోకి తీసుకొని కొనుగోలు చేయాలన్నారు. ఈ విషయంపై ఇప్పటికే కలెక్టర్‌ను, ప్రైవేటు కంపెనీల యాజమన్యాలను కూడా కలిశామన్నారు. వెంటనే పొగాకు పంటను కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు రాయిణి వినోద్‌బాబు, మల్లారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం తక్షణమే రైతుల వద్ద ఉన్న నల్లబర్లీ పొగాకు వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.