గుంటూరు రూరల్: శ్రీవేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం కృషి విజ్ఞాన కేంద్రంలో శాసీ్త్రయ సలహా మండలి సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. సోమవారం నగర శివారుల్లోని లాంఫాంలోని కేవీకేలో ప్రధాన శాస్త్రవేత్త, హెడ్ డాక్టర్ ఎం.యుగంధర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. పశు విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ జేవీ రమణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పరిశోధనశాలల్లో రూపుదిద్దుకుంటున్న సాంకేతికతను రైతులకు చేరవేయటంలో కృషివిజ్ఞాన కేంద్రాలు కీలకపాత్ర పోషిస్తున్నాయన్నారు. వివిధ రంగాల్లో శిక్షణ, నైపూణ్యాల వృద్ధి కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించి గ్రామీణ యువతకు వ్యవసాయం, అనుబంధ రంగాల్లో నిష్ణాతులుగా తీర్చిదిద్దుతున్నారని కొనియాడారు. ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ శారదజయలక్ష్మిదేవి మాట్లాడుతూ శాసీ్త్రయ సలహా మండలి సూచనలు, సాంకేతిక పరిజ్ఞానం రైతులకు అందించాలని అభిప్రాయపడ్డారు. ఏపీ పశుగణాభివృద్ధి సంస్థ సీఈవో డాక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ గేదెల యాజమాన్య పద్ధతులపై కేవీకే కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. విస్తరణ సంచాలకులు డాక్టర్ బి. శోభామణి, డాక్టర్ శివన్నారాయణలు క్షేత్రస్థాయి పరిశీలనలు, సూక్ష్మ సమన్వయంతో నిర్వహించేట్లు ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు నరసింహారావు, ఎల్‌ఆర్‌ఎస్ హెడ్ డాక్టర్ ముత్తారావు వ్యవసాయ, అనుభంద సంస్థల నిపుణులు వారి సలహాలను అందించారు. కేవీకే శాస్త్రవేత్తలు 2024–25 సంవత్సరంలో చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. 2025–26 సంవత్సరంలోని కార్యాచరణ ప్రణాళికలను వివరించారు. కేవీకే ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ యుగంధర్‌కుమార్ మాట్లాడుతూ సలహామండలి సలహాలు సూచనలు పాటిస్తూ భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో కెవికె శాస్త్రవేత్తలు, ఎల్‌ఆర్‌ఎస్ సిబ్బంది, రైతులు, శాస్త్రవేత్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.