జేసీ అధ్యక్షతన పౌడా ప్రత్యేక సమావేశం
నరసరావుపేట: పల్నాడు జిల్లా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (పౌడా) ప్రత్యేక సమావేశం సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా జాయింట్ కలెక్టర్, పౌడా వైస్ చైర్మన్ గనోరే సూరజ్ ధనుంజయ్ అధ్యక్షతన నిర్వహించారు. ఈసందర్భంగా 2025–26 ఏడాదికి బడ్జెట్ అంచనాలతో పాటు జిల్లాలో చేయాల్సిన అభివృద్ధి పనులపై చర్చించారు. అలాగే 2024–25 ఏడాదికి సంబంధించిన ఖర్చులతో పాటు 2025–26 ఏడాది బడ్జెట్ అంచనాలను చర్చించి ఆమోదించినట్లు పౌడా కార్యదర్శి నవీన్‌కుమార్ వెల్లడించారు. అనంతరం నిర్వహించిన సాధారణ సమావేశంలో వైస్ చైర్మన్ ఎనిమిది అంశాలపై చర్చించి ఆమోదం తెలియచేశారని ఆయన స్పష్టం చేశారు. దీనిలో రీజినల్ డెప్యూటీ డైరక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ పి.మధుకుమార్, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ ఆర్.రాజానాయక్, జిల్లా టూరిజం అధికారి జి.నాయుడమ్మ హాజరయ్యారు.
భవిత ఫిజియోథెరపిస్టులకు ఇంటర్వ్యూలు..
కలెక్టర్ కార్యాలయంలోని తన చాంబర్‌లో సోమవారం జేసీ గనోరే సూరజ్ ధనుంజయ్ భవిత ప్రత్యేక స్కూళ్లలో పనిచేసేందుకు ఫిజియో థెరపిస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. మొత్తం నాలుగు ఖాళీలు ఉండగా ఆరుగురు హాజరయ్యారు. డీహెచ్‌ఎస్ డాక్టర్ బీవీ రంగారావు, డీఎంహెచ్‌ఓ డాక్టర్ రవి, డీఈఓ ఎల్.చంద్రకళ, ఐఈబీ కో–ఆర్డినేటర్ ఆర్.సెల్వరాజ్‌లు ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అభ్యర్థులకు వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేయటం జరుగుతుందని తెలిపారు.