ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో ఆదివారం భక్తుల రద్దీ అధికంగా కనిపించింది. తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు నిర్వహించిన పలు అర్జిత సేవల్లో ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. ఉదయం ఆరు గంటల నుంచి ప్రారంభమైన భక్తుల రద్దీ మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు కొనసాగింది. పవిత్ర కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు ఘాట్‌రోడ్డు, మహా మండపం లిప్టు, మెట్ల మార్గంలో కొండపైకి చేరుకున్నారు. రూ. 500, రూ.300, రూ.100 టికెట్‌తో పాటు సర్వ దర్శనం క్యూలైన్‌లో భక్తుల రద్దీ కనిపించింది. సర్వ దర్శనానికి రెండు గంటలకు పైగా సమయం పట్టింది.
అర్జిత సేవల్లో ఉభయదాతలు
తెల్లవారుజామున ప్రధాన ఆలయంలో అమ్మవారి మూలవిరాట్ వద్ద నిర్వహించిన ఖడ్గమాలార్చన, ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన శ్రీచక్రనవార్చన, లక్ష కుంకుమార్చన, యాగశాలలో నిర్వహించిన చండీహోమం, శాంతి కల్యాణంలో ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. అర్జిత సేవల్లో పాల్గొన్న ఉభయదాతలకు ప్రత్యేక క్యూలో అమ్మవారి దర్శనానికి అనుమతించారు. రూ. 500 టికెట్ కొనుగోలు చేసిన భక్తులతో పాటు వీఐపీలు, సిఫార్సు లేఖలపై వచ్చిన వారికి అంతరాలయ దర్శనం కల్పించారు. రద్దీ తగ్గుముఖం పట్టిన కొంత సమయం తర్వాత రూ.300 క్యూలైన్‌లో వేచిఉన్న భక్తులకు ముఖ మండప దర్శనానికి అనుమతించారు.
భక్తులకు ఇబ్బంది కలుగకుండా
దేవస్థానం ఏర్పాట్లు
భక్తులకు ఇబ్బంది కలగకుండా ఏఈవో చంద్రశేఖర్ క్యూలైన్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ కింది స్థాయి సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఎండల కారణంగా ఆలయ ప్రాంగణంతో పాటు మహామండపం, గోశాల, కనకదుర్గనగర్, ఘాట్‌రోడ్డులో దేవస్థానం భక్తులకు మంచినీటిని సరఫరా చేసింది. దర్శనం పూర్తయిన భక్తులకు ఉచిత అన్న ప్రసాద వితరణ చేసింది.