బాపట్ల: కమ్యూనిస్టు ఉద్యమంలో చురుకై న పాత్ర పోషిస్తున్న జేబీ శ్రీధర్ (69) గుండెపోటుతో ఆదివారం మృతి చెందారు. ఆయన వినుకొండంలో జన్మించారు. సీపీఐ సానుభూతిపరులైన తల్లిదండ్రులు ఆనందరావు, మార్తమ్మల పోరాట లక్షణాలను అలవర్చుకుని విద్యార్థి దశ నుంచి ప్రజా సమస్యలపై పోరాటం చేశారు. ఐదు దశాబ్దాలపాటు వామపక్ష సిద్ధాంతాల వ్యాప్తికి ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాలలో కృషి చేశారు. 12 ఏళ్లపాటు విశాలాంధ్ర జర్నలిస్టుగా పని చేశారు. బాపట్లలో జరిగిన వామపక్ష ఉద్యమాల్లో శ్రీధర్ కీలక పాత్ర పోషించారు. హృదయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నా ఉద్యమమే ఊపిరిగా జీవితం గడిపారు. శ్రీధర్ మృతిపై సీపీఐ రాష్ట్ర కార్యవర్గం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరావు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, జల్లి విల్సన్, జంగాల అజయ్‌కుమార్, ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్‌జీ, జిల్లా కార్యదర్శి తన్నీరు సింగరకొండ తదితరులు శ్రీధర్ భౌతికకాయానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వైఎస్సార్‌సీపీ బాపట్ల నియోజకవర్గ ఇన్‌చార్జి కోన రఘుపతి కూడా శ్రీధర్ కుటుంబానికి సానుభూతి తెలిపారు. బాపట్ల మాజీ ఎమ్మెల్యేలు చీరాల గోవర్ధనరెడ్డి, గాదె వెంకటరెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు కోకి రాఘవరెడ్డి, కాగిత సుధీర్‌బాబు, జోగి రాజా, కొక్కిలిగడ్డ చెంచయ్య తదితరులు సంతాపం తెలిపిన వారిలో ఉన్నారు.