
సమాజాభివృద్ధికి హేతుబద్ధ ఆలోచనలు దోహదం
నరసరావుపేట ఈస్ట్: సమాజాభివృద్ధికి హేతుబద్ధ ఆలోచనలు, ఆచరణలు దోహదపడతాయని వక్తలు స్పష్టం చేశారు. హేతువాద సంఘం కార్యాలయంలో ఆదివారం పల్నాడు జిల్లా సంఘం ద్వితీయ మహాసభలు నిర్వహించారు. మతం–సైన్స్ అంశంపై ఆంధ్రప్రదేశ్ హేతువాద సంఘం అధ్యక్షుడు కరణం రవీంద్రబాబు మాట్లాడారు. మనుష్యుల్లో ఆలోచనా శక్తిని మ తాలు ముందుకు సాగనీయవని తెలిపారు. మతాలు విశ్వాసాలతో ముడిపడి ఉండగా, సైన్స్ సత్యాన్వేషణ చేస్తుందని స్పష్టం చేశారు. హేతుబద్ధంగా మాట్లాడినందుకు కోపర్నికస్, గెలీలియో, బ్రూనో వంటి వారిని మతపెద్దలు వేధింపులకు గురి చేశారని తెలిపారు. విశ్వ తత్వం– జీవతత్వం అంశంపై భారత హేతువాద సంఘం ప్రధాన కార్యదర్శి మేడూరి సత్యనారాయణ మాట్లాడారు. విశ్వానికి ఆది, అంతాలు లేవని స్పష్టం చేశారు. మానవుడు సహజ సహేతుకంగా ఆలోచించే జీవి కావడంతో ఇంతటి అభివృద్ధిని సాధించాడని వివరించారు. సాయంత్రం నిర్వహించిన అధ్యయన తరగతుల్లో నిత్యజీవితంలో హేతువాదం అంశంపై ఆంధ్రప్రదేశ్ హేతువాద సంఘం ప్రధాన కార్యదర్శి షేక్ దరియావలి మాట్లాడారు. మూఢ విశ్వాసాలను ప్రశ్నించాలని తెలిపారు. డాక్టర్ గుమ్మా రచించిన హేతువాద, మానవతావాద తత్వవేత్త రావిపూడి వెంకటాద్రి గ్రంథాన్ని ఈదర గోపీచంద్ ఆవిష్కరించగా, రవీంద్రబాబు సమీక్షించారు.
నూతన కార్యవర్గం ఎంపిక
ఈ సందర్భంగా జిల్లా సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా బి.పి.వి. సుబ్బయ్య, ప్రధాన కార్యదర్శిగా కట్టా సుబ్బారావు, ఉపాధ్యక్షునిగా వి.ఎస్.ఎస్. మూర్తి, సహాయ కార్యదర్శిగా షేక్ చినమస్తాన్, కోశాధికారిగా ఈదర గోపీచంద్‌తో పాటు కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు.
ఘనంగా జిల్లా హేతువాద సంఘం
ద్వితీయ మహాసభలు
జిల్లా నూతన కార్యవర్గ ఎన్నిక