గుంటూరులీగల్: పోక్సో చట్టం ప్రకారం బాధితులకు ఎలాంటి సహాయం అందించాలి, ఇటువంటి కేసులలో సున్నితత్వం అనేది ఉండాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి వైవీఎస్‌బీజీ పార్థసారథి అన్నారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ అమరావతి ఆదేశాల మేరకు శనివారం గుంటూరులో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి పార్థసారథి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియావుద్దీన్ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. గుంటూరు పోక్సో కోర్ట్ న్యాయమూర్తి ఏ అనిత మాట్లాడుతూ బాధిత మహిళా, చైల్డ్ కానీ న్యాయం కోసం కేసు ఫైల్ చేసి న్యాయస్థానాన్ని ఆశ్రయించినపుడు నేరం చేసిన వారికి శిక్ష విధించి బాధితులకు న్యాయం చేయగలమని వెల్లడించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) గుంటూరు సయ్యద్ జియావుద్దీన్ మాట్లాడుతూ కేసుల్లో బాధితులకు నల్సా పరిహార పథకం, లైంగిక దాడులకు గురైన వారికి రక్షణ పథకం 2012 ద్వారా, రాష్ట్ర ప్రభుత్వం అందించే పరిహార పథకం 2015 ద్వారా పరిహారం ఎలా పొందవచ్చునో వివరించారు. గుంటూరు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ ప్రాజెక్టు డైరెక్టర్ కె.విజయలక్ష్మి, ట్రైనీ న్యాయమూర్తులు, న్యాయమూర్తులు, పోలీస్ సిబ్బంది, ఇతర సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
నదుల సంరక్షణ ముఖ్యం
ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, గుంటూరు సహకారంతో జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియావుద్దీన్ మాట్లాడుతూ హిమనీ నదుల సంరక్షణ అనేది చాలా ముఖ్యమని అన్నారు. బొగ్గు, చమురు వనరులను తగ్గించి సహజ వనరులకు ప్రాముఖ్యత ఇవ్వాలన్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా నీరు లేక ప్రజల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. రాబోవు తరాలకు నీటి విలువను తెలియజేయాలన్నారు. ప్రధానన్యాయమూర్తి పార్థసారథి మాట్లాడుతూ గ్లోబల్ వార్మింగ్ వలన పర్యావరణం కలుషితం అవుతుందన్నారు. అన్ని అవసరాలకు మున్సిపల్ వాటర్ వాడుకొని తాగునీటికి మినరల్ వాటర్ వాడుతున్నామని, ఖాళీ స్థలాల్లో ఇళ్లు నిర్మించడం, మొక్కలను పెంచకపోవడం ప్రపంచం బాగుండాలంటే ఇప్పటి తరం అభివృద్ధి పథంలోకి తీసుకురావడానికి నీటిని సంరక్షించడానికి తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు నిర్వహించిన వ్యాస రచన, డ్రాయింగ్ పోటీలలో విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, గుంటూరు ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీర్ ఎండీ నజీనా బేగం, గుంటూరు డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ వాటర్ రిసోర్స్ డిపార్ట్‌మెంట్ బి.ఆదిశేషయ్య, ప్యానెల్ అడ్వకేట్ కట్టా కాళిదాసు, పలు పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు.