సత్తెనపల్లి: పోస్టల్ శాఖ బలోపేతమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుందని కేంద్ర కమ్యూనికేషన్, గ్రామీణ అభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. సత్తెనపల్లి రఘురాంనగర్‌లో తపాలా శాఖకు చెందిన స్థలంలో రూ.2.60 కోట్లతో నూతనంగా నిర్మించనున్న ప్రధాన తపాలా కార్యాలయ భవన నిర్మాణానికి చేపట్టిన శంకుస్థాపనలో శనివారం ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం వెంకటేశ్వర గ్రాండ్‌లో తపాలా శాఖ నిర్వహించిన సమావేశంలో ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడారు. డాక్టర్ పెమ్మసాని మాట్లాడుతూ మార్పులకు అనుగుణంగా పోస్టల్ శాఖను ముందుకు తీసుకెళుతున్న ఉద్యోగులకు ధన్యవాదాలు తెలిపారు. ప్రతి గ్రామంలో కేంద్ర ప్రభుత్వ పథకాలు అట్టడుగు వర్గాలకు పోస్టల్ శాఖ ద్వారానే చేరుతున్నాయన్నారు. కొన్ని ప్రభుత్వ శాఖలను తీసుకుంటే వందల సంవత్సరాలు వేగవంతంగా వెళుతూ కొన్ని మూతపడుతుంటాయన్నారు. ఎయిర్ ఇండియా పూర్తిగా మూతబడిందన్నారు. ఇన్ని సౌకర్యాలు కల్పిస్తున్నప్పటికీ పోస్టల్ శాఖ నుంచి రూ.11 వేల కోట్లు మాత్రమే ఆదాయం వస్తుందని, ఖర్చులు చూస్తే రూ.38 వేల కోట్లు ఉన్నాయన్నారు. రూ.27 వేల కోట్లు మైనస్‌లో ఉన్నామని, దీనిలో ఎక్కువగా వేతనాలు ఉన్నాయన్నారు. పోస్టల్‌శాఖలో మునుపెన్నడూ లేని విధంగా సీటీఓ, వైస్ ప్రెసిడెంట్‌ను రిక్రూట్ చేశామన్నారు. వారి టెక్నాలజీతో ఉద్యోగులు మరింత ముందుకు వెళ్లే అవకాశం ఉందన్నారు. పార్సిల్, డెలివరీ వేగవంతంగా జరగాలని, జవాబుదారీతనం ఉండాలన్నారు. ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ, ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్ చీఫ్ పోస్టుమాస్టర్ జనరల్ కె.ప్రకాష్‌లు మాట్లాడారు. ముందుగా రఘురాంనగర్‌లోని 48 సెంట్ల స్థలంలో ప్రధాన తపాలా కార్యాలయం భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అసంఘటిత కార్మికులకు 12 అంకెల గల ప్రత్యేక గుర్తింపు కార్డులు అర్హులకు పంపిణీ చేశారు. మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణను పోస్టల్ శాఖ అధికారులు సత్కరించారు. కార్యక్రమంలో విజయవాడ రీజియన్ పోస్ట్‌మాస్టర్ జనరల్ డీఎస్‌వీఆర్.మూర్తి, నరసరావుపేట డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ పి.వెంకటస్వామి, జనసేన గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు, మున్సిపల్ మాజీ చైర్మన్ యెల్లినేడి రామస్వామి, డీఎన్‌ఆర్ ఫౌండేషన్ చైర్మన్ దరువూరి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
తపాలా శాఖ పథకాలపై
గ్రామ స్థాయిలో అవగాహన కల్పిస్తాం
కేంద్ర కమ్యూనికేషన్, గ్రామీణాభివృద్ధి
శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని
సత్తెనపల్లిలో ప్రధాన తపాలా
కార్యాలయ భవన నిర్మాణానికి
శంకుస్థాపన