నరసరావుపేట: వైద్య ఆరోగ్య శాఖలో విశేష సేవలు అందిస్తున్న ఆశా వర్కర్లకు కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని, చట్టబద్ధమైన సౌకర్యాలు, పెన్షన్ కల్పించాలని కోరుతూ ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) పల్నాడు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.చంద్రకళ, డి.శివకుమారి డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలో డీఎండీహెచ్‌వో డాక్టర్ రవికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా శివకుమారి మాట్లాడుతూ పేద ప్రజలకు ఆరోగ్యసేవలు అందిస్తున్న ఆశా వర్కర్లని ప్రభుత్వం కార్మికులుగా గుర్తించాలని కోరారు. దీర్ఘకాలంగా పనిచేస్తూ విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు, అనారోగ్యంతో అర్ధంతరంగా మృతి చెందిన ఆశాల కుటుంబాలను ఆదుకోవాలని విన్నవించారు. గ్రూపు ఇన్సూరెన్స్, ఈఎస్‌ఐ, పీఎఫ్, ఉద్యోగ భద్రత కల్పించి మట్టి ఖర్చులు, ఇతర సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎన్‌హెచ్‌ఎం స్కీం ఏర్పడి 20 ఏళ్లు గడుస్తున్నప్పటికీ కనీస వేతనాలు చెల్లించడంలేదని తెలిపారు. గడిచిన ఏడేళ్లలో ఆశాలకు వేతనాన్ని వెయ్యి రూపాయలు మాత్రమే పెంచి ప్రభుత్వం చేతులు దులుపుకుందని విమర్శించారు. ప్రతి ఆదివారం, పండుగలకు సెలవులు ఇవ్వాలని, పని భారం తగ్గించాలని, పారితోషకంలేని పనులు చేయించరాదని కోరారు. ఆశాలకు ఆస్పత్రులలో విశ్రాంతి గదులు ఏర్పాటు చేయాలని, ప్రసూతి సెలవుల అమలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, వేతనంతో కూడిన సాధారణ, ఆరు నెలల మెడికల్ సెలవులు ఇవ్వాలని కోరారు. ఆశాల సమస్యలు పరిష్కరించకపోతే యూనియన్ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని శివకుమారి తెలిపారు. కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి రత్నకుమారి, జిల్లా ఉపాధ్యక్షులు పి. వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలి ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ పల్నాడు జిల్లా కమిటీ డిమాండ్ డీఎంహెచ్‌వోకు వినతిపత్రం అందజేసిన నాయకులు