దొడ్లేరు ఆయకట్టు రైతుల్లో సంతోషం
క్రోసూరు: నాగార్జున సాగర్ కెనాల్స్ అధికారులు ఐదు రోజుల వారాబందీ పద్ధతిలో చింతపల్లి మేజరు ద్వారా కస్తల మైనర్‌కు నీళ్లు విడుదల చేశారు. మండలంలోని దొడ్లేరు గ్రామానికి చెందిన ఆయకట్టు రైతులు దాళ్వాలో వరి సాగు చేస్తున్నారు. గత పది రోజులుగా నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయని బుధవారం గ్రామంలో ధర్నా చేశారు. దీంతో కెనాల్స్ ఏఈ బండి శ్రీనివాసరావు గురువారం నీళ్లు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు కాలువలకు నీళ్లు విడుదల చేశారు. శుక్రవారం కస్తల మైనర్ కాలువకు చేరుకున్నాయి. ఐదు రోజుల పాటు విడుదల చేస్తామని, ఆ తరువాత ఎర్రబాలెం మేజరుకు నీళ్లు విడుదల చేస్తామని ఆయన తెలిపారు.
కారు ఢీకొని వ్యక్తి మృతి
పిడుగురాళ్ల: ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొనడంతో వ్యక్తి మృతి చెందిన సంఘటన కరాలపాడు వెళ్లే నాలుగు రోడ్ల జంక్షన్ వద్ద శుక్రవారం జరిగింది. సంఘటనకు సంబంధించి ఎస్‌ఐ శివనాగరాజు తెలిపిన వివరాల మేరకు...దాచేపల్లి మండలం పెదగార్లపాడు గ్రామానికి చెందిన మందా సాగర్‌బాబు(35) భార్య మరియకుమారితో కలిసి ద్విచక్ర వాహనంపై కరాలపాడు వస్తున్నారు. నీలంపాటి అమ్మవారి గుడి నుంచి వేగంగా వస్తున్న కారు కరాలపాడు నాలుగు రోడ్ల జంక్షన్ వద్ద ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో సాగర్‌బాబుకు తీవ్రం గానూ, భార్య మరియకుమారికి స్వల్పంగా గాయాలయ్యాయి. ఇద్దరిని పిడుగురాళ్ల పట్టణంలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. సాగర్‌బాబు అప్పటికే మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు మరియకుమారి కాలికి గాయమైంది. ఆమె ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతునికి ముగ్గురు పిల్లలు ఉన్నారు.
కాల్వలో గుర్తుతెలియని
మృతదేహం లభ్యం
వేటపాలెం: స్ట్రయిట్ కట్ కాల్వలో చెక్ వాల్ దగ్గరలో నీటిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని శుక్రవారం గుర్తించినట్లు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు. మృతుడికి సుమారు 58 ఏళ్ల వయస్సు ఉంటుందని భావిస్తున్నారు. ఒంటిపై ఎర్రగీతల బనియన్ ధరించి ఉన్నాడు. మృతుడు దగ్గరలోని చేపలు పట్టుకొనే యానాదుల కాలనీకి చెందిన వాడిగా భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు.
ఎట్టకేలకు కస్తల మైనర్‌కు సాగునీరు విడుదల