పెదకూరపాడు: సత్తెనపల్లి – అమరావతి మార్గంలో ప్రయాణికుల రైల్వే గేట్ల కష్టాలకు త్వరలో తెరపడనుంది. ఈ మార్గంలో పెదకూరపాడు వద్ద రోజుకు 40 సార్లు దాకా గేటు పడుతోంది. ప్రతిసారి 8 నుంచి 10 నిమిషాలు వరకు వాహనాలు నిలిచిపోతున్నాయి. సత్తెనపల్లి, పెదకూరపాడు నియోజకవర్గాల పరిధిలో 30 గ్రామాల ప్రజలు, సత్తెనపల్లి పట్టణంలో అనేక కాలనీల్లోని ప్రజలు రైల్వే గేటుతో నిత్యం అవస్థలు పడుతున్నారు. ఇదే దుస్థితి పల్రాడు ప్రాంతాల్లో అనేక గ్రామాల్లో ఉంది.
ఆర్‌ఓబీలు మంజూరు
పల్నాడు జిల్లాలో హైదరాబాద్ రైల్వే మార్గంలో మూడు చోట్ల లెవెల్ క్రాపింగ్ గేట్లు వద్ద ఆర్‌ఓబీ (రైల్వే ఓవర్ బ్రిడ్జిలు)ను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. నిర్మాణానికి సంబంధించిన గెజిట్‌ను రైల్వే శాఖ గెజిట్‌ను బుధవారం విడుదల చేసింది. సత్తెనపల్లి–అమరావతి రోడ్డులో (కాలచక్ర రహదారి) పెదకూరపాడు యార్డు వద్ద ఎల్‌సీ నెంబర్ 27 వద్ద, వెన్నాదేవి –కంకాణాల పల్లి రోడ్డు, దాచేపల్లి–కేసానుపల్లి రోడ్డులోని తమ్మలచెరువు –నడికూడి స్టేషన్ల మధ్యలో ఎల్‌సీ నంబర్ 81 దగ్గరున్న లెవల్ క్రాసింగ్ గేట్ల వద్ద ఆర్‌ఓబీలు మంజూరు చేసింది.
ట్రాఫిక్, ప్రమాదాల నివారణకు చెక్
ఈ రహదారిలో నిత్యం వందలాది వాహనాలు ప్రయాణిస్తాయి. క్రాసింగ్ గేట్ల వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జిలు నిర్మాణం చేపట్టాలని ఈ ప్రాంత ప్రజలు ఎప్పటి నుంచో కోరుతున్నారు. బ్రిడ్జిలు నిర్మాణం జరిగితే నిత్యం ప్రయాణికుల కష్టాలు తీరతాయి. ప్రమాదాలను కూడా నివారించవచ్చు. ఆర్టీసీ, ప్రైవేట్ పాఠశాల బస్సులతో పాటు లారీలు, ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనదారులకు ఇబ్బందులు తప్పుతాయి.
తీరనున్న పల్నాడువాసుల చిరకాల కోరిక మూడు ఓవర్ బ్రిడ్జిల మంజూరు కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు, ప్రయాణికులు