రెంటచింతల: ప్రతి రోజూ సరదాపడి ఊగే ఊయలే తన ప్రాణం తీస్తుందని ఆ బాలుడు ఊహించలేకపోయాడు. రోజూ మాదిరే ఇంట్లో చీరతో కట్టిన ఊయల ఊగుతున్న సమయంలో మెడకు బిగుసుకుని ఊపిరాడక చిన్నారి మృతి చెందిన సంఘటన పల్నాడు జిల్లా రెంటచింతలలో చోటుచేసుకుంది. వెంకటేశ్వరస్వామి మాణం కాలనీకి చెందిన సలిబండ్ల అద్విక్‌రెడ్డి(11) ఆరోగ్యం బాగో లేదని చెప్పి గురువారం పాఠశాలకు వెళ్లకుండా, అమ్మమ్మ ఇంటి పైగదిలో చీరతో కట్టిన ఊయల ఊగుతున్నాడు. మధ్యాహ్నం అన్నం తినడానికి కిందకు అద్విక్‌రెడ్డి రాకపోవడంతో అమ్మమ్మ కటకం శౌరీలు పైకి వెళ్లి చూసింది. ఊయల చీర అద్విక్‌రెడ్డి మెడకు బిగుసుకుని పోయి ఉండటం గమనించి కేకలు వేసింది. బంధువులు వెంటనే స్థానిక వైద్యుని దగ్గరకు తీసుకెళ్లారు. అప్పటికే బాలుడు మృతి చెందినట్లు నిర్ధారించారు. అద్విక్‌రెడ్డి స్థానిక ఫాతిమా విద్యానికేతన్ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాడు. బాలుడి తల్లి నిర్మలారాణి అదే పాఠశాలలో ఉపాధ్యాయునిగా పని చేస్తోంది. తల్లి, బంధువులు రోదిస్తున్న తీరు అక్కడ వారిని కంట తడి పెట్టించింది. విద్యార్థి అద్విక్‌రెడ్డి అకాల మృతికి పాఠశాల డైరెక్టర్ ఏరువ మర్రెడ్డి, హెచ్‌ఎం ఏరువ స్టేఫీ స్టార్ సంతాపం తెలిపారు. పాఠశాలకు సెలవు ప్రకటించారు.
ఆగిన బాలుడి ఊపిరి