ముప్పాళ్ల మండలంలోని చాగంటివారిపాలెం గ్రామానికి చెందిన నలుగురు వ్యవసాయ కూలీలు ఫిబ్రవరి 9న సాయంత్రం మిరప కోతలకు వెళ్లి ట్రాక్టర్‌పై తిరిగి వస్తూ ప్రమాదంలో మృతి చెందారు. తక్షణ సాయంగా జిల్లా కలెక్టర్ ఒక్కో కుటుంబానికి రూ.25వేలు అందించారు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సహాయం చేస్తామని ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ, కలెక్టర్ అరుణ్‌బాబు హామీ ఇచ్చారు. ఇప్పటికీ ఆయా కుటుంబాలకు సాయం అందలేదు. సీఎం రిలీఫ్ ఫండ్ ఫైల్ సాంకేతిక కారణాలతో వెనక్కి వచ్చిందని స్థానిక ఆధికారలు చెబుతున్నారు. గత సోమవారం జిల్లా కలెక్టర్ నిర్వహించే ప్రజాసమస్యల పరిష్కారవేదిక కార్యక్రమంలో బాధిత కుటుంబాలు నష్టపరిహారం అందివ్వాలని కోరాయి. బీమా పథకం అమలులో ఉంటే ప్రతి కుటుంబానికీ హక్కుగా రూ.10 లక్షలు దక్కేదని బాధితులు వాపోతున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో వైఎస్సార్ బీమా పథకం లబ్ధిదారులు మరణించిన వెంటనే గంటల వ్యవధిలో సంబంధిత గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది వెళ్లి పేరు నమోదు చేసుకొని, మట్టి ఖర్చుల నగదు అందజేసేవారని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు.