నరసరావుపేటటౌన్: తీవ్ర పని ఒత్తిడితో ఉద్యోగం చేయలేక పోతున్నా.. వద్దు అంటే పెళ్లి చేశారు.. ఇప్పుడు ఉద్యోగం మానేస్తే భార్య తరఫు బంధువుల నుంచి మాట వస్తుంది.. ఒత్తిడి తట్టుకోలేక లోకం విడిచి వెళ్తున్నా..అమ్మా నాన్న నన్ను క్షమించండి ! అంటూ నాలుగు నెలల క్రితం వివాహం అయిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సూసైడ్ నోట్ రాసి బలవన్మరణానికి పాల్పడ్డాడు. పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలో మంగళవారం చోటు చేసుకున్న సంఘటనకు సంబంధించి వన్‌టౌన్ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బాపట్ల జిల్లా బల్లికురవ మండలం గుడిపాడుకు చెందిన బండ్ల హనుమంతరావు (29) కు నరసరావుపేట మండలం పమిడిమర్రుకు చెందిన సౌజన్యతో నాలుగు నెలల కిందట వివాహం అయ్యింది. హనుమంతరావు రెండేళ్ల నుంచి హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. పని ఒత్తిడి తట్టుకోలేక ఇటీవల సెలవుపై వచ్చి స్వగ్రామంలో ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. గమనించిన పెద్దలు అతనికి నచ్చ చెప్పారు. కొన్ని రోజులు బాగానే ఉండి రెండ్రోజుల కిందట భార్యను పుట్టింట్లో వదిలి నరసరావుపేట బస్టాండ్ సమీపంలోని ఓ లాడ్జిలో గది అద్దెకు తీసుకున్నాడు. సోమవారం నుంచి అతను గది బయటకు రాకపోవడాన్ని గమనించిన లాడ్జి సిబ్బంది మంగళవారం రాత్రి తలుపు బద్దలకొట్టి చూడగా ఫ్యాన్‌కు బెడ్‌షీట్‌తో ఉరేసుకుని కనిపించాడు. సమాచారం అందుకున్న వన్‌టౌన్ సీఐ సీహెచ్ విజయ్ చరణ్ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
ఆత్మహత్యకు వివిధ మార్గాల్లో ప్రయత్నం
బండ్ల హనుమంతరావు ఎలాగైనా ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్న తర్వాత పలు రకాలుగా ప్రయత్నం చేసి విఫలమై చివరకు ఉరివేసుకొని మృతి చెందినట్లు సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు భావిస్తున్నారు. కత్తితో మెడ కోసుకునేందుకు మొదట ప్రయత్నం చేశాడు. మృతుడి మెడ భాగంలో ఉన్న గాట్లను పరిశీలించిన పోలీసులు అక్కడ ఉన్న కత్తిని స్వాధీనం చేసుకున్నారు. సంఘటనా స్థలంలో పురుగుల మందు డబ్బాను స్వాధీనం చేసుకున్నారు.
పురుగు మందు తాగిన భార్య
భర్త ఆత్మహత్య విషయం తెలుసుకున్నయ సౌజన్య క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆమెను నరసరావుపేటలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చేర్పించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెప్పుకొస్తున్నారు.
పని ఒత్తిడే కారణమంటూ సూసైడ్ నోట్ నాలుగు నెలల క్రితమే వివాహం