ప్రత్తిపాడు: పత్తి వ్యాపారి పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ప్రత్తిపాడు మండలం పాతమల్లాయపాలెం గ్రామానికి చెందిన కాసు నాగిరెడ్డి వ్యవసాయం చేసుకుంటూ పదేళ్లుగా పత్తి కమీషన్ వ్యాపారం చేస్తున్నాడు. శ్రీకాకుళం జిల్లా బామిని మండలం దమ్మిడిజోలా గ్రామ పరిధిలోని రైతుల దగ్గర పత్తిని కమీషన్ పద్ధ్దతిన బొమ్మా కొండారెడ్డి అనే అతనికి ఇప్పిస్తుంటాడు. అయితే ఆ పత్తికి సంబంధించిన డబ్బులు, కమీషన్ కలిపి నాగిరెడ్డికి రూ.43 లక్షలు కొండారెడ్డి ఇవ్వాల్సి ఉంది.కొంత కాలంగా రైతులు డబ్బులు అడుగుతున్నారని, వారికి సమాధానం చెప్పలేకపోతున్నానని, రైతుల పత్తికి సంబంధించిన డబ్బులు ఇవ్వాలని కొండారెడ్డిని నాగిరెడ్డి అడుగుతున్నాడు. దీంతో తన దగ్గర డబ్బులు లేవని, పదే పదే డబ్బులు అడిగితే కోర్టులో కేసు వేస్తానని కొండారెడ్డితోపాటు ఆయన సోదరుడు శ్రీనివాస్‌రెడ్డి నాగిరెడ్డిని బెదిరిస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతులకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక మంగళవారం గ్రామంలోని సాగర్ కాలువ వద్ద ఉన్న సమాధుల వద్ద పురుగు మందు తాగి నాగిరెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు విషయాన్ని అతని భార్య రాజ్యలక్ష్మికి తెలియజేశారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. ఈ మేరకు ఎస్‌ఐ కె.నాగేంద్ర బుధవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.