● నాలుగు గంటల శ్రమ అనంతరం అదుపులోకి వచ్చిన మంటలు ● కాలిపోయిన సీసీ కెమెరాల కేబుల్‌వైర్లు ● అగ్నికి ఆహుతైన విద్యుత్ కేబుల్
విజయపురి సౌత్: సాగర్ ప్రధాన డ్యాం ఎడమ వైపున గల ఎర్త్‌డ్యాం కింద బుధవారం అగ్నిప్రమాదం జరిగింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో మంటలు లేచాయి. ఎండిన కార్పె గ్రాస్‌కు అంటుకోవడంతో అగ్నికీలలు ఉవ్వెత్తున లేచాయి. దిగువనే ఉన్న శివం పార్కులో ఎండిన గడ్డి ఉండటంతో దానికి మంటలు అంటుకుని గాలి వాటానికి కిలోమీటరు మేర తగలబడింది. మెయిన్ డ్యాంకు సమీపంలో వ్యూ పాయింట్ దగ్గర విధులు నిర్వహిస్తున్న స్పెషల్ ప్రొటెక్షన్ పోర్స్ (ఎస్‌పీఎఫ్) సిబ్బంది అధికారులను అలర్ట్ చేశారు. మెయిన్ డ్యాం ముఖ ద్వారం వద్ద విధుల్లో ఉన్న సిబ్బంది, జెన్‌కో, సాగునీటి శాఖ సిబ్బంది అష్టకష్టాలు పడ్డారు. ఈలోపు ఫైర్ ఇంజన్ వచ్చింది. నాలుగు గంటల శ్రమ అనంతరం ఎట్టకేలకు మంటలను ఫైర్ సిబ్బంది అదుపులోకి తెచ్చారు. ఎర్త్ డ్యాంపై గల విద్యుత్ కేబుల్స్, సీసీ కెమెరాల కేబుల్స్ పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. రాత్రి కావడంతో ఎంతమేరకు నష్టం జరిగింది తెలియడం లేదని డ్యాం ఈఈ మల్లికార్జునరావు తెలిపారు. గురువారం అంచనా వేస్తామని వెల్లడించారు.