సిమెంట్ ఫ్యాక్టరీల ప్రతినిధులకు సూచించిన జిల్లా కలెక్టర్
నరసరావుపేట: జిల్లాలో సిమెంట్ ఫ్యాక్టరీల ఏర్పాటుకై పొలాలు ఇచ్చిన రైతు కుటుంబాల్లో అర్హులైన వారికి విధిగా ఉపాధి కల్పించి, ఉద్యోగాల్లో స్థానికులకే ప్రాధాన్యం ఇవ్వాలని జిల్లా కలెక్టర్ పి.అరుణబాబు ఆయా కంపెనీల ప్రతినిధులను కోరారు. మంగళవారం కలెక్టరేట్‌లో భవ్య, చెట్టినాడ్ సిమెంట్ ఫ్యాక్టరీ ప్రతినిధులు, గ్రామస్తులు, అధికారులతో జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావుతో కలసి కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పల్నాడు జిల్లా అభివృద్ధికి పరిశ్రమల అవసరం చాలా ముఖ్యమన్నారు. సిమెంట్ పరిశ్రమలు ఉన్న తంగేడ, పెదగార్లపాడు ప్రదేశాలలోని పొలాలు రైతులు నష్టపోకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామస్తుల తరపున జానీబాషా, సీవీ రావు లేవనెత్తిన ఐదు ప్రధాన అంశాలపై సంబంధిత రెవెన్యూ, పంచాయతీ రాజ్, సర్వే, వ్యవసాయ, ఉద్యాన, హౌసింగ్ తదితర శాఖలతో కమిటీని ఏర్పాటు చేశామన్నారు. ఈ కమిటీ క్షేత్రస్థాయిలో పర్యటించి 10 రోజుల్లో నివేదిక అందించాలని ఆదేశించారు. దాని ఆధారంగా అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. కంపెనీల యజమాన్యాలు ప్రభుత్వ అధికారులకు సహకరిస్తూ ఆయా గ్రామాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహించాలని కంపెనీ ప్రతినిధులను కోరారు. ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాతూ పరిశ్రమల యాజమాన్యం స్థానిక ప్రజల మనసు దోచుకొనే విధంగా పలు చర్యలు చేపట్టాలన్నారు. లా అండ్ ఆర్డర్ సమస్యలు రాకుండా వ్యవహరించాలని కోరారు. జేసీ సూరజ్ గనోరే, డీఆర్‌ఓ ఎ.మురళి, గురజాల ఆర్డీఓ మురళి, జిల్లా పరిశ్రమల అధికారి రవీంద్ర, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారి నజీన బేగం, డీపీఓ ఎంవీ భాస్కరరెడ్డి, డీఏఓ ఐ.మురళి, ఉద్యాన శాఖాధికారి సీహెచ్.వి.రమణారెడ్డి, హౌసింగ్ పీడీ ఎస్.వేణుగోపాలరావు, గ్రామస్తులు పాల్గొన్నారు.