సత్తెనపల్లి: బీసీ సంక్షేమ సంఘం పల్నాడు జిల్లా కో–కన్వీనర్‌గా సత్తెనపల్లికి చెందిన సంకుల తిరుమలరావు (తిరుమల), నియోజకవర్గ అధ్యక్షుడిగా మందడపు శివసాయిలు నియమితులయ్యారు. ఈ మేరకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లాకా వెంకళరావు యాదవ్ నుంచి తిరుమల, శివసాయిలు మంగళవారం నియామక పత్రాలు అందుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ నియామకానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. తిరుమల, శివసాయి నియామకంపై పలువురు హర్షం వెలిబుచ్చారు.
గడ్డిమందు తాగి రైతు ఆత్మహత్య
పిడుగురాళ్ల: గడ్డిమందు తాగి రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని గుత్తికొండ గ్రామంలో చోటు చేసుకుంది. సంఘటనకు సంబంధించి ఎస్‌ఐ మోహన్ తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని గుత్తికొండ గ్రామానికి చెందిన పరిటాల పోతురాజు(60) అనే రైతు గత కొన్ని రోజుల నుంచి అనారోగ్యంతోపాటు మతిస్థిమితం సక్రమంగా లేకపోవటం వలన సోమవారం రాత్రి గడ్డిమందు తన ఇంట్లోనే తాగాడు. గమనించిన భార్య హనుమాయమ్మ వెంటనే హుటాహుటిన పిడుగురాళ్ల ప్రైవేటు హాస్పటల్‌కు తరలించింది. ప్రథమ చికిత్స అనంతరం గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం గుంటూరు జీజీహెచ్‌లో మృతి చెందినట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతుడి కుమారుడు పరిటాల రామలింగయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ మోహన్ పేర్కొన్నారు.
మీటర్ రీడర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి
నరసరావుపేటటౌన్: మీటర్ రీడర్స్ అందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ సంఘ ప్రతినిధులు మంగళవారం విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సీహెచ్ రాంబొట్లను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం సంఘం జిల్లా కార్యదర్శి షేక్ యాసిన్, జాయింట్ సెక్రటరీ శివసాయి మాట్లాడుతూ మీటర్ రీడర్స్‌కి కనీస వేతనం అమలు చేయాలన్నారు. మీటర్ రీడర్స్‌కి ఎస్క్రో అకౌంట్ ద్వారా జీతాలు చెల్లించాలన్నారు. రిచార్జి స్మార్ట్ మీటర్లు వస్తున్న తరుణంలో మీటర్ రీడర్స్ అందరికీ సంస్థలోనే ప్రత్యామ్నాయ ఉపాధి చూపించాలన్నారు. గత 20 ఏళ్లుగా చాలీచాలని జీతంతో పనిచేస్తున్నామని, తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. తమ సంఘం రాష్ట్రవ్యాప్త ప్రథమ మహాసభ అనంతరం కార్యచరణ ప్రకటించడం జరుగుతుందన్నారు. అందులో భాగంగా మీటర్ రీడర్స్ కార్మికులు మార్చి 18న డీఈ ఆఫీస్ ముందు ధర్నా, 20న ఎస్‌ఈ ఆఫీసు ముందు ధర్నా, 24న కలెక్టర్‌కు సమస్యలపై వినతి పత్రం సమర్పించడం, 27న సీఎండీ కార్యాలయం ముందు ధర్నా తదితర కార్యచరణ రూపొందించామన్నారు.
అప్పుల బాధ తాళలేక మహిళ ఆత్మహత్య
దామరపల్లి(తాడికొండ): వ్యవసాయంలో నష్టం రావడంతో అప్పుల బాధ పెరిగి కుటుంబ పోషణ భారంగా మారడంతో మహిళ ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన ఘటన తాడికొండ మండలం దామరపల్లి గ్రామంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. తాడికొండ మండలం దామరపల్లి గ్రామానికి చెందిన వట్టికూటి శ్రీనివాసరావు వ్యవసాయం చేసుకుని జీవనం సాగిస్తుంటాడు. గత కొన్నేళ్లుగా వ్యవసాయంలో నష్టం వస్తుండటంతో ఉన్న 3 ఎకరాలు అమ్మి అప్పులు తీర్చారు. కౌలుకు పొలం తీసుకొని వ్యవసాయం చేస్తుండగా ఈ ఏడాది కూడా తీవ్రంగా నష్టం రావడంతో మనస్థాపం చెందారు. అప్పు ఇచ్చిన వారు ఒత్తిడికి గురిచేస్తుండటంతో కుటుంబ పోషణ కూడా కష్టంగా మారడంతో మనస్థాపంతో శ్రీనివాసరావు భార్య అరుణ కుమారి ఈనెల 14న పొలానికి వేసేందుకు తెచ్చిన గడ్డిమందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. గుంటూరులోని ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తుండగా మంగళవారం ఉదయం మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతురాలి భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కె.వాసు తెలిపారు.
పట్టాభిపురం సీఐ పోస్టుపై సందిగ్ధం
నగరంపాలెం(గుంటూరు వెస్ట్): పశ్చిమ సబ్ డివిజన్‌లోని పట్టాభిపురం పీఎస్ సీఐ పోస్టుపై సందిగ్ధం నెలకొంది. వీఆర్‌లో ఉన్న సీఐ ఎం.మధుసూదనరావును ఈనెల 16న పట్టాభిపురం పీఎస్ సీఐగా నియమిస్తూ ఓ పోలీస్ ఉన్నతాధికారి నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. అప్పటి వరకు విధుల్లో ఉన్న వీరేంద్రబాబును సీసీఎస్‌కు బదిలీ చేశారు. ఈ క్రమంలో కొత్త సీఐగా మధుసూదనరావు అదే రోజు రాత్రి స్టేషన్‌లో బాధ్యతలు స్వీకరించారు. అయితే గుంటూరు రేంజ్ కార్యాలయం నుంచి ఈ పోస్టింగ్‌కు బ్రేక్‌పడినట్లు తెలుస్తోంది. దీంతో సందిగ్ధం నెలకొంది. బుధవారం సాధ్యమైనంత వరకు ఆయనే మళ్లీ సీఐగా కొనసాగే అవకాశాలు ఉన్నాయని సమాచారం.
బీసీ సంక్షేమ సంఘం జిల్లా కో–కన్వీనర్‌గా తిరుమల