కొల్లూరు: ఖరీఫ్‌లో వరి సాగు చేసిన అన్నదాతలు మూడొంతులు పంట అయినకాడికి దళారులకు విక్రయించి నష్టాలను చవిచూశారు. నామమాత్రంగా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో సామాన్య రైతులు పండించిన పంటల విక్రయానికి ఆంక్షలు ఎదురవడంతో దళారులను ఆశ్రయించక తప్పలేదు. ప్రస్తుతం రబీలో సాగు చేసిన పంటకై నా ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించి పారదర్శకంగా కొనుగోలు చేస్తుందని ఆశించిన రైతులకు భంగపాటే ఎదురవుతోంది.
దీనంగా తెల్లజొన్న రైతుల పరిస్థితి
రబీలో తెల్లజొన్న సాగు చేసిన రైతుల పరిస్థితి దీనంగా మారింది. నియోజకవర్గంలో చుండూరు, అమృతలూరు మండలాలలో రైతులు అధిక శాతం మినుము, పెసర సాగు చేశారు. పెసర పంటకు మాత్రమే మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. కొల్లూరు, భట్టిప్రోలు, వేమూరు మండలాలలో ఎక్కువ విస్తీర్ణంలో మొక్కజొన్న పంట సాగైంది. సుమారు 8 వేల ఎకరాలకు పైగా తెల్లజొన్న సాగులో ఉంది.
కొనే దిక్కేది?
కొల్లూరు మండలంలో 1,700 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో తెల్లజొన్న వేయగా.. ప్రస్తుతం పంట చేతికందింది. రైతులు జొన్న కంకులు కోసుకొని నూర్పిళ్లు పూర్తి చేస్తున్నారు. మండలంలోని కొల్లూరు, క్రాప, అనంతవరం, చిలుమూరు ప్రాంతాలలో తెల్లజొన్న కంకులు కోత పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం సుమారు 200 ఎకరాల వరకు జొన్న కోతలు పూర్తయ్యాయి. ఎకరాకు సుమారు రూ. 20 వేలు పెట్టుబడులు పెట్టారు. సగటున 25 బస్తాల దిగుబడి లభిస్తోంది. గతేడాది ఇదే సమయంలో జొన్న క్వింటాకు రూ. 2,400 వరకు లభించడంతో రైతులకు లబ్ధి చేకూరింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధర ప్రకటించకపోవడంతో క్వింటాకు దళారులు రూ. 2 వేలు నుంచి రూ. 2,100 వరకు ఇస్తున్నారు. దీంతో రైతాంగం నష్టపోతోంది. రబీలో సాగు చేసిన పంటల విక్రయాలకు వీలుగా వ్యవసాయ శాఖాధికారులు ఈక్రాప్ బుకింగ్ చేశారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులకు ప్రయోజనం లేకుండా పోయింది.
పంట చేతికందినా విక్రయించే మార్గం శూన్యం ప్రభుత్వం నుంచి కొనుగోలు, మద్దతు ధర లేక ఆవేదన దళారులకు తక్కువ ధరకే అమ్మాల్సిన దుస్థితి కూటమి సర్కారు తీరుతో నష్టపోతున్న అన్నదాతలు
కొనుగోలు కేంద్రాల ఊసేదీ?
రబీలో సాగు చేసిన పంటల కొనుగోలుకు వ్యవసాయ శాఖాధికారులు పంట నమోదు చేసినప్పటికీ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. దీంతో రైతులకు నష్టం వాటిల్లుతోంది. దళారులు చెప్పిన ధరలకే అమ్ముకోవాల్సిన అగత్యం ఏర్పడింది. పంట కోతలు చివరి దశకు చేరుకునే సమయంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం వల్ల రైతులకు ప్రయోజనం లేకుండాపోతుంది.
– టి. సురేష్, రైతు
అనుమతులొస్తే
కేంద్రాలు ఏర్పాటు
తెల్లజొన్న ప్రస్తుతం కోత దశకు రావడంతో రైతులు నూర్పిళ్లు చేపడుతున్నారు. కొనుగోలు కేంద్రాల ఏర్పా టు విషయంలో మార్క్‌ఫెడ్ నుంచి ఆదేశాలు రాలేదు. అనుమతులు వచ్చిన వెంటనే కేంద్రాలు ఏర్పాటు చేస్తాం
– ఆర్.వెంకటేశ్వరరావు,
వ్యవసాయశాఖాధికారి, కొల్లూరు.
తెల్లజొన్న రైతు విలవిల
తెల్లజొన్న రైతు విలవిల