పిడుగురాళ్ల: ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొన్న సంఘటనలో వ్యక్తి మృతిచెందిన సంఘటన పట్టణంలో సోమవారం జరిగింది. సంఘటనకు సంబంధించి పట్టణ ఎస్‌ఐ మోహన్ తెలిపిన వివరాల ప్రకారం.. రెంటచింతల గ్రామానికి చెందిన మక్కెన శివతేజ(30) పేరేచర్లలో కొబ్బరి బొండాల దుకాణం పెట్టుకొని జీవిస్తున్నాడు. ఈ క్రమంలో పేరేచర్ల నుంచి రెంటచింతలకు స్వగ్రామానికి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా మార్గ మధ్యలో పిడుగురాళ్ల పట్టణంలోని కొండమోడు సమీపంలో శ్రీ లక్ష్మీ బార్ అండ్ రెస్టారెంట్, ఇండియన్ పెట్రోల్ బంక్ సమీపంలో లారీ అతివేగంగా వచ్చి శివతేజ నడుపుతున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొనటంతో రోడ్డుపై పడి తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కారణాలు తెలుసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ మోహన్ తెలిపారు.