కొడుకులు అడుక్కుతినమంటున్నారు! | - | Sakshi
Sakshi News home page

కొడుకులు అడుక్కుతినమంటున్నారు!

Published Tue, Mar 18 2025 8:42 AM | Last Updated on Tue, Mar 18 2025 8:40 AM

నరసరావుపేట రూరల్‌: ‘అయ్యా.. నాకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. నా స్వశక్తితో సంపాదించిన రెండు ఇళ్లను కొడుకులకు ఇచ్చాను. ఇప్పుడు నేను పక్షవాతంతో పాటు షుగర్‌, బీపీతో అనారోగ్యానికి గురికావడంతో ఇద్దరు కుమారులూ పట్టించుకోవడం లేదు. పనిచేసే ఓపిక ఉన్న నా భార్యను మాత్రం చిన్న కుమారుడు తన వద్ద ఉంచుకుని దుకాణంలో పని చేయించుకుంటున్నాడు. నేను ఎలా బతకాలని అడిగితే అడుక్కుతినమంటూ కొడుకులు సలహా ఇస్తున్నారు. ఏ పని చేయలేని స్థితిలో ఉన్న నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను.

జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మాచర్లకు చెందిన వృద్ధుడైన ఏడుకొండలు ఆవేదన ఇది.. ఇదేవిధమైన పలు అర్జీలు ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చాయి. పరిశీలించిన జిల్లా ఎస్పీ కె.శ్రీనివాసరావు అర్జీలపై సత్వరం చర్యలు చేపట్టాలని పోలీసు సిబ్బందిని ఆదేశించారు. ఆర్థిక, కుటుంబ, ఆస్తి తగదాలకు సంబంధించి 75 ఫిర్యాదులు అందాయి.

కన్న కూతురు మోసం చేసింది..

నాకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఉద్యోగరీత్యా కుమారుడు, కోడలు నిజామాబాద్‌లో ఉంటున్నారు. కుమారుడు నాతో పాటు నా భర్త చిన్నయ్య బాగోగులు చూసేవాడు. కోవిడ్‌ సమయంలో రెండు నెలలు మా వద్దకు రావడానికి కుమారుడికి వీలుకాలేదు. ఆ సమయంలో నా భర్త అనారోగ్యానికి గురికావడంతో గ్రామంలోనే నివసించే మా కుమార్తె శాంతకుమారి తన ఇంటికి తీసుకెళ్లింది. ఆ సమయంలో నా భర్త పేరున ఉన్న రూ.6లక్షలు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ నగదును డ్రా చేయడంతో పాటు పూర్వార్జితంగా వస్తున్న 1.40 ఎకరాలను తనకు గిఫ్ట్‌గా ఇచ్చినట్టుగా రాయించుకుంది. తదనంతరం నా భర్త చనిపోవడంతో ఇప్పుడు నన్ను పట్టించుకోవడం లేదు. ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ నగదును నాకు అందించేలా చర్యలు తీసుకోండి.

– పి.చిన్నమ్మ,

ముసాపురం, పెదకూరపాడు మండలం

రెండుసార్లు హత్యాయత్నం చేశారు

సత్తెనపల్లిలోని పెద్దమసీదు ప్రాంతంలో నివసించే నాపై గత ఏడాది ఎన్నికల ముందు దాడి జరిగింది. 15 రోజులు ఐసీయూలో చికిత్స పొందాను. నాలుగు నెలల క్రితం మరోమారు హత్యాయత్నం చేశారు. షాదీఖానా బజార్‌లో తల్వార్‌తో దాడికి పాల్పడ్డారు. షేక్‌ ఆదం షరీఫ్‌ అతని కుమారులు గౌస్‌, రఫీలతో పాటు ఉమర్‌, అక్తాబ్‌ ఈ దాడిలో పాల్గొన్నారు. సత్తెనపల్లి టౌన్‌ పీఎస్‌లో వీరిపై ఫిర్యాదు చేశాను. ఇప్పటివరకు వారిపై చర్యలు తీసుకోలేదు. నాపై కౌంటర్‌ కేసులను పోలీసులు నమోదు చేసారు. నిందితులు ఇప్పటికీ తల్వార్లతో తిరుగుతూ బెదిరింపులకు పాల్పడుతున్నారు.

– షేక్‌ రఫీ, సత్తెనపల్లి

హత్య కేసులో నిందితులను అరెస్ట్‌ చేయాలి

మా అమ్మ ఆరే లక్ష్మమ్మ కారంపూడిలో నివసిస్తుంది. గత ఏడాది మార్చి 27వ తేదీన ఆమెను హత్య చేశారు. ఈ కేసులో అనుమానితులుగా ఆరే రమేష్‌, ఆరే రాంబాబు, పులి శ్రీలక్ష్మి, ఆరే పద్మల పేర్లను పోలీసులకు మేం అందజేశాం. ఆస్తి కోసం గతంలో వీరు ఆమెను చంపటానికి ప్రయత్నించారు. ఇప్పటివరకు ఈ కేసులో నిందితులను అరెస్ట్‌ చేయలేదు. స్థానిక ప్రజాప్రతినిధి ఒత్తిడి మేరకే పోలీసులు చర్యలు తీసుకోవడం లేదు. నిందితులను అరెస్ట్‌ చేసి న్యాయం చేయాలి.

– తాళ్ల పద్మ, అడిగొప్పల, దుర్గిమండలం

జిల్లా ఎస్పీ ఎదుట వాపోయిన ఓ వృద్ధ తండ్రి ప్రజాసమస్యల పరిష్కార వేదికలో 75 ఫిర్యాదులు స్వీకరణ

కొడుకులు అడుక్కుతినమంటున్నారు! 1
1/4

కొడుకులు అడుక్కుతినమంటున్నారు!

కొడుకులు అడుక్కుతినమంటున్నారు! 2
2/4

కొడుకులు అడుక్కుతినమంటున్నారు!

కొడుకులు అడుక్కుతినమంటున్నారు! 3
3/4

కొడుకులు అడుక్కుతినమంటున్నారు!

కొడుకులు అడుక్కుతినమంటున్నారు! 4
4/4

కొడుకులు అడుక్కుతినమంటున్నారు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement