అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు
నరసరావుపేట: జిల్లాలో రబీ సీజన్‌కు సంబంధించి సాగునీరు అందని కారణంగా సెంటు భూమిలో పంట సైతం ఎండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లో సోమవారం సర్వేలు, ప్రభుత్వ పథకాల అమలుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. మండల వ్యవసాయ అధికారులు ఎప్పటికప్పుడు తమ పరిధిలో రైతుల అవసరాలకు తగ్గట్టు నీరుఅందేలా చూడాలన్నారు. మండలస్థాయిలో కరవు పర్యవేక్షణ సెల్ ప్రారంభించాలన్నారు. పంచాయతీ నిధులతో గ్రామాల్లో తాగునీటి సరఫరా చేయాలన్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సందర్శకులకు తాగునీటి సౌకర్యం కల్పించాలన్నారు. జిల్లాలో పీ–4 సర్వే 95 శాతం, వర్క్ ఫ్రం హోం 45 శాతం పూర్తయ్యాయన్నారు. జిల్లా ప్రజల చేత అభివృద్ధికి సూచనలు చేసే పీ–4 కన్సల్టెన్సీ సర్వేలో పెద్దఎత్తున ప్రజలు పాల్గొనేలా చూడాలన్నారు. మార్చి నెలాఖరులోగా రైతు రిజిస్టేషన్లు 60 శాతం పూర్తిచేయాలన్నారు. ఫామ్‌పాండ్స్ పథకంలో భాగంగా ప్రతి గ్రామ పంచాయతీలో కనీసం మూడు ఫామ్‌పాండ్స్ ప్రారంభించేలా చూడాలన్నారు. పేదల ఇళ్ల నిర్మాణాల కోసం ఆర్థికసాయం పెంపు విషయంపై లబ్ధిదారులకు ఇంజినీరింగ్ అసిస్టెంట్లు అవగాహన కల్పించాలన్నారు. ఇళ్ల నిర్మాణాల్లో పేదలకు 365 రోజుల ఉపాధి కల్పించాలన్నారు. కాగా, కందిపప్పు, శనగ కొనుగోలు కోసం రైతుల రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలని జేసీ సూరజ్ గనోరే ఆదేశించారు. డీఆర్వో ఎ.మురళి, సీపీఓ జి.శ్రీనివాస్, డీపీఓ విజయభాస్కరరెడ్డి, గ్రామ వార్డు సచివాలయాల నోడల్ అధికారి వెంకటరెడ్డి, డ్వామా పీడీ సిద్ధ లింగమూర్తి, హౌసింగ్ పీడీ వేణుగోపాలరావు తదితరులు పాల్గొన్నారు.
ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులతో మేలు
నరసరావుపేట: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ (ఏపీసీఎన్‌ఎఫ్) విధానంలో పల్నాడు జిల్లాలోని రైతులందరూ పంటలను సాగు చేయాలని పల్నాడు జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు కోరారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ప్రకృతి వ్యవసాయ కషాయాలు, తెగుళ్లు, పెరటి తోటల పెంపకం, పుస్తకాలు, పాంప్లెట్స్ ఆవిష్కరించి ప్రకతి వ్యవసాయం సిబ్బంది ఏర్పాటు చేసిన ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల విక్రయ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎటువంటి రసాయనాలు, పురుగుమందుల వాడకుండా ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో తయారైన ఉత్పత్తులను తినడం ద్వారా ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. జిల్లా అధికారులందరూ ప్రకతి వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేశారు. డీపీఓ పి.అమలకుమారి మాట్లాడుతూ ప్రతి సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక సందర్భంగా కలెక్టర్ ఆఫీస్ వద్ద ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల స్టాల్ నిర్వహించడం జరుగుతుందన్నారు. డీఎఫ్‌ఓ కృష్ణప్రియ, డీఆర్‌ఓ మురళి, డీఏఓ ఐ.మురళి, స్టేట్ ఎన్‌ఎఫ్‌ఏ మన్విత, జిల్లా ప్రకతి వ్యవసాయ సిబ్బంది మేరీ, సౌజన్య, బేబీ రాణి, యూనిట్ ఇన్‌చార్జిలు పాల్గొన్నారు.
●జిల్లాలో డిగ్రీ, పీజీ, డిప్లొమా, ప్రొఫెషనల్ కోర్సులు చదువుతున్న పేద, అర్హులైన 17 మంది దివ్యాంగులైన విద్యార్థులకు ఏపీ విభిన్న ప్రతిభావంతులు, సీనియర్ సిటిజన్స్ సహాయక సంస్థ ద్వారా ఉచితంగా ల్యాప్ టాప్‌లను కలెక్టర్ పి.అరుణ్‌బాబు అందజేశారు.