శక్తి వాహనాలు ప్రారంభించిన జిల్లా ఎస్పీ
నరసరావుపేట: మహిళలు ఫోన్లో శక్తియాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఆపద సమయంలో పోలీసు వారి నుంచి తక్షణ సహాయం పొందాలని జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు పేర్కొన్నారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసులకు, మహిళలకు అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మహిళలు, బాలికల భద్రత కోసం శక్తి యాప్‌ను ప్రవేశపెట్టిందన్నారు. ఈ యాప్ ప్రధానంగా మహిళలపై జరిగే వేధింపులు, లైంగికదాడులు, ఇతర హింసాత్మక సంఘటనలను నివారించటానికి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే యాప్ ఓపెన్ చేసి ఎస్‌ఓఎస్ బటన్‌ను నొక్కితే, లొకేషన్ ఆధారంగా పోలీసులు తక్షణమే స్పందించి అక్కడకు చేరతారన్నారు. అనంతరం జిల్లాకు మంజూరైన శక్తి వాహనాలను ప్రారంభించారు. పరిపాలన విభాగం అదనపు ఎస్పీ జేవీ సంతోష్, నరసరావుపేట, సత్తెనపల్లి, గురజాల డీఎస్పీలు కె.నాగేశ్వరరావు, ఎం.హనుమంతరావు, జగదీష్, మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ వెంకటరమణ, మహిళా పోలీస్ స్టేషన్ సీఐ సుభాషిణి, మహిళా ఎస్‌ఐలు, మహిళా పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
‘డ్రగ్స్ వద్దు బ్రో’ పోస్టర్ విడుదల..
నరసరావుపేట: జిల్లాలో గంజాయి అక్రమ రవాణా, క్రయ విక్రయాలపై కఠినంగా వ్యవహరించాలని, దానిని నిర్మూలించడానికి కొన్ని ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వాటిని అరికట్టే దిశలో ఉన్నామని జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు పేర్కొన్నారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసు అధికారులతో నేరసమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా జిల్లాలో డ్రగ్స్ వద్దు బ్రో పోస్టర్ విడుదల చేశారు.