నరసరావుపేట: జిల్లాలోని సహకార సంఘాల కంప్యూటరీకరణ ఈనెల 20వ తేదీ నాటికి పూర్తిస్థాయిలో చేయాలని, 21 నుంచి జిల్లాలో 59 పీఏసీలు ఈ–పీఏసీలుగా మార్చాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన 5వ జిల్లా సహకార అభివృద్ధి కమిటీ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. ఏడాదిగా సంఘాల కంప్యూటీకరణ జరుగుతోందని, పురోగతి సరిగాలేదన్నారు. సరిగా పనిచేయని సంఘం సీఈఓపై ఏం చర్యలు తీసుకున్నారని జిల్లా సహకార అధికారిని, గుంటూరు కేంద్ర సహకార బ్యాంకు సీఈఓను ప్రశ్నించారు. కంప్యూటీకరణ పూర్తిచేసే విషయంలో పనిచేయని వారిపై మార్చి 21వ తేదీన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో నాటుసారా తయారీపై నిఘా కోసం డ్రోన్లు వినియోగించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. నాటు సారా తయారీ, రవాణా, వినియోగాన్ని సంపూర్ణంగా నిర్మూలించేందుకు కృషిచేయాలన్నారు. కలెక్టరేట్‌లో నవోదయం 2.0 కార్యక్రమంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. సారా తయారీ, వినియోగాలను నిరసిస్తూ నవోదయం పోస్టర్‌ను విడుదల చేశారు. అదేవిధంగా జిల్లాలో గుర్తించిన 442 చిత్తడి నేలలు ఉన్నాయని, వాటిలో ఏడు ఇన్‌సైడ్ రిజర్వ్ ఫారెస్ట్, 435 రెవెన్యూ ఇతర ప్రదేశాలలో ఉన్నాయని వాటిని సంబందిత శాఖలు పరిశీలించి ఈనెల 28నాటికి నివేదికలు అందజేయాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు సంబందిత అధికారులను ఆదేశించారు. డీఆర్‌ఓ మురళి, డీఎఫ్‌ఓ కృష్ణప్రియ, ఆర్డీవోలు కె.మధులత, రమాకాంత్ రెడ్డి, మురళి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
మొల్లమాంబ జీవితం ఆదర్శం..
నరసరావుపేట: కవయిత్రి మొల్లమాంబ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని నేటి యువత, విద్యార్థులు స్ఫూర్తి పొందాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు కోరారు. గురువారం వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలో కవియిత్రి మొల్ల జయంతిని ఘనంగా నిర్వహించారు. మొల్ల చిత్రపటానికి పూలమాలలు వేసి ఘననివాళులర్పించిన అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మొల్ల జయంతిని అధికారంగా నిర్వహించేందుకు ఆదేశాలు జారీ చేసిందన్నారు. రామాయణాన్ని సరళమైన భాషలో అందరికీ అర్థమయ్యేలా కేవలం ఐదు రోజులలో రచించిన గొప్ప కవి మొల్లమాంబ అని కొనియాడారు. ఆమె పేరుతో ప్రభుత్వం స్టాంప్ కూడా రిలీజ్ చేసిందన్నారు. ఈ సందర్భంగా పలువురు శాలివాహన సంఘం నాయకులు కోరిన విధంగా ప్రభుత్వ నిబంధనలు అనుసరించి మట్టిని అందించే విధంగా చర్యలు తీసుకోవాలని డీఆర్‌ఓను ఆదేశించారు. బీసీ వెల్ఫేర్ అధికారి వెంకటేశ్వర్లు. సంఘ నాయకులు శ్రీనివాసులు, బసవేశ్వరరావు, వెంకయ్య, వెంకటేశ్వర్లు, మంగమ్మ పాల్గొన్నారు.
సహకార అభివృద్ధి కమిటీ సమీక్షలో
జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు