● టీటీడీ , జిల్లా అధికారులు సమన్వయంతో పనిచేయాలి ● టీటీడీ ఈఓ శ్యామలరావు ఆదేశం
తాడికొండ: వెంకటపాలెం శ్రీవారి ఆలయ ప్రాంగణంలో ఈనెల 15న జరుగనున్న శ్రీనివాస కల్యాణానికి సంబంధించిన అన్ని పనులను సకాలంలో పూర్తి చేయాలని టీటీడీ ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. వెంకటపాలెంలోని ఆలయ ప్రాంగణంలో బుధవారం టీటీడీ అధికారులు, కలెక్టర్ ఎస్.నాగలక్ష్మితో కలిసి ఆయన గుంటూరు జిల్లా అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. శ్యామలరావు మాట్లాడుతూ శ్రీనివాస కల్యాణంపై సమీప గ్రామాల్లో టీటీడీ ప్రచారం రథం ద్వారా ప్రచారం చేయాలని సూచించారు. భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా కల్యాణ వేదిక పరిసరాల్లో అవసరమైన గ్యాలరీలు, క్యూలైన్‌లో ఏర్పాటు చేయాలని ఆదేశించారు. శ్రీవారి ఆలయం, కల్యాణ వేదిక పరిసరాల్లో భక్తులను ఆకట్టుకునేలా విద్యుత్ అలంకరణలు చేపట్టాలన్నారు. భక్తులు సులభతరంగా స్వామిని దర్శించుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. ట్రాఫిక్ అంతరాయం తలెత్తకుండా పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని సూచించారు. కల్యాణానికి భజన బృందాలు, శ్రీవారి సేవకులను పెద్ద ఎత్తున ఆహ్వానించాలని ఆదేశించారు. జిల్లా, టీటీడీ అధికారుల కోసం ప్రత్యేకంగా జాయింట్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని చెప్పారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టి సీసీ కెమెరాలతో నిరంతరం భద్రతను పర్యవేక్షించాలని ఆదేశించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు సులువుగా వచ్చేందుకు వీలుగా తగినన్ని ఆర్టీసీ బస్సులు నడిపేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. స్వామి కల్యాణాన్ని నేరుగా చూడలేని లక్షలాది మంది భక్తుల సౌలభ్యం కోసం ఎస్వీబీసీ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయాలని ఆదేశించారు. వేదిక పరిసరాలలో చెత్తను ఎప్పటికప్పుడు తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు .అత్యవసర సమయంలో తక్షణం స్పందించేలా విపత్తు నిర్వహణ బృందాలను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. భక్తులకు అవసరమైన వైద్య సదుపాయాలు, మందులు, సిబ్బంది, అంబులెన్సులు అందుబాటులో ఉంచాలన్నారు. భక్తులకు అన్నప్రసాదాలు, తాగునీరు, మజ్జిగ పంపిణీ చేసేందుకు అవసరమైన శ్రీవారి సేవకులను సిద్ధం చేసుకోవాలని చెప్పారు. సాయంత్రం 4 గంటల నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడానికి తగు ఏర్పాట్లు చేయాల్సిందిగా హెచ్ డీపీపీ కార్యదర్శిని ఆదేశించారు. అనంతరం ఆయన అధికారులతో కలసి కల్యాణ వేదిక, తదితర పరిసరాల్లో జరుగుతున్న ఏర్పాట్లను పర్యవేక్షించి పలు సూచనలు చేశారు. టీటీడీ అదనపు ఈఓ సి.హెచ్.వెంకయ్య చౌదరి, జేఈఓ వీరబ్రహ్మం, గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఏర్పాట్ల పర్యవేక్షణకు మంత్రుల బృందం
సాక్షి, అమరావతి: శ్రీనివాస కల్యాణం ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు మంత్రుల బృందం ఏర్పాటైంది. సీఎం చంద్రబాబు ఆ కార్యక్రమానికి హాజరు కానున్న నేపథ్యంలో మంత్రులు ఆనం రామనారాయణరెడ్డితోపాటు అనగాని సత్యప్రసాద్, వి.అనిత, పి.నారాయణ, కందుల దుర్గేష్‌తో కూడిన బృందం ఏర్పాట్ల పర్యవేక్షణకు గురువారం ఆలయాన్ని సందర్శిస్తారని, టీటీడీ ఈఓ కూడా అందుబాటులో ఉండాలని సూచిస్తూ దేవదాయ శాఖ కార్యదర్శి వి.వినయ్ చంద్ బుధవారం మెమో జారీ చేశారు.