నరసరావుపేట ఈస్ట్: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో నిర్వహించనున్న పదో తరగతి దూరవిద్య పరీక్షలకు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసినట్టు జిల్లా విద్యాశాఖాధికారి ఎల్.చంద్రకళ తెలిపారు. పరీక్షల నిర్వహణపై శంకరభారతీపురం జెడ్పీ హైస్కూల్‌లో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో డీఈఓ చంద్రకళ మాట్లాడుతూ పరీక్షలు ఈనెల 17 నుంచి 28 వరకు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరుగుతాయని పేర్కొన్నారు. జిల్లా పరిధిలో 27 పరీక్ష కేంద్రాలలో 1,200 మంది పరీక్షకు హాజరు కానున్నట్టు తెలిపారు. ఆయా పరీక్ష కేంద్రాలకు చీఫ్ సూపరింటెండెంట్‌లు, డిపార్ట్‌మెంట్ ఆఫీసర్లు, 57 మంది ఇన్విజిలేటర్లను నియమించామని పేర్కొన్నారు. 28 మంది సిట్టింగ్ స్క్వాడ్‌లను నియమించామని చెప్పారు. ఈ సందర్భంగా పరీక్షల నిర్వహణ కరదీపికను సిబ్బందికి అందజేశారు. కార్యక్రమంలో జిల్లా ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ కె.ఎం.ఎ.హుస్సేన్, డెప్యూటీ డీఈఓలు ఎస్.ఎం.సుభాని, వి.ఏసుబాబు, రిసోర్స్ పర్సన్ బీవీఎల్ వరప్రసాదు తదితరులు పాల్గొన్నారు.
డీఈఓ చంద్రకళ