రాజుపాలెం: మండలంలోని ఆకుల గణపవరంలో ప్రసన్నాంజనేయ స్వామి జయంత్యుత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న జాతీయ స్థాయి ఎడ్ల పందేలు సోమవారం రసవత్తరంగా జరిగాయి. ఆరు పళ్ల విభాగంలో బాపట్ల జిల్లా చుండూరు మండలం వేటపాలెం గ్రామానికి చెందిన అత్తోట శిరీష, శివకృష్ణచౌదరికి చెందిన ఎడ్ల జత 4,250 అడుగుల దూరం లాగి ప్రథమ స్థానం కై వసం చేసుకుంది. కృష్ణాజిల్లా విజయవాడకు చెందిన వల్లభనేని మోహన్‌రావు, ఉత్తం పద్మావతిరెడ్డి ఎడ్ల జత 4,000 అడుగుల దూరం లాగి ద్వితీయ స్థానం, పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం కేసానుపల్లి గ్రామానికి చెందిన నెల్లూరి రామకోటయ్య ఎడ్ల జత 3,783 అడుగుల దూరం లాగి తృతీయ స్థానం, సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు గ్రామానికి చెందిన పాశం గోవర్ధనరెడ్డి, రాయుడు సుబ్బారావు ఎడ్ల జత 3,500 అడుగుల దూరం లాగి నాలుగో స్థానం, ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం అక్కలరెడ్డిపల్లికి చెందిన కూతర్ల దీక్షిత్‌రెడ్డి, నిశాంత్‌రెడ్డికి చెందిన ఎడ్లజత 3,380 అడుగుల దూరం లాగి ఐదో స్థానం సాధించాయి. మంగళవారం జూనియర్స్ విభాగంలో పందేలు జరగనున్నాయని కమిటీ సభ్యులు తెలిపారు. రోజూ పందేలు తిలకించేందుకు వచ్చే రైతులకు అన్నదానం చేస్తున్నట్టు కమిటీ సభ్యులు తెలిపారు.