నరసరావుపేట: ఉపాధి హామీ పథక సిబ్బంది బాధ్యతగా పనిచేసి జిల్లాను ప్రగతి పథంలో నడిపించాలని పంచాయతీరాజ్, రూరల్ డెవలప్‌మెంట్ కమిషనర్ మైలవరపు వీఆర్ కృష్ణతేజ అన్నారు. జిల్లాలోని ఉపాధి హామీ పథకంలో పనిచేసే క్షేత్ర సహాయకులకు ఆదివారం టౌన్ హాలులో ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పథకంలో పనిచేసే ప్రతి ఒక్కరికీ కనీసంగా రూ.300 కూలీ వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన సిబ్బందికి సూచించారు. ప్రతి కుటుంబానికీ వంద రోజుల పని కల్పించాలని తెలిపారు. కూలీల హక్కులు, క్షేత్ర సహాయకులు, మేట్ల విధులు, బాధ్యతలు, జాబ్ కార్డు, పనుల కల్పన, ఎన్‌ఎంఎంఎస్ యాప్ ద్వారా మస్టర్ నిర్వాహణ తదితర అంశాల గురించి వివరించారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ కమిషనర్ తెలిపిన పేరామీటర్స్‌ను అనుసరించి జిల్లా ప్రగతికి దోహదం చేయాలని కోరారు. ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు మాట్లాడుతూ ఫరం పాండ్ నిర్మాణానికి గ్రామాల్లోని నాయకులతో కలిసి విజయవంతం చేస్తామని హామీ ఇచ్చారు. ఈజీఎస్ డైరక్టర్ వి.కె.షణ్ముక్‌కుమార్, అదనపు కమిషనర్ మల్లెల శివప్రసాద్, పథక సంచాలకులు యం.సిద్ధలింగమూర్తి, నరసరావుపేట, గురజాల, సత్తెనపల్లి, వినుకొండ క్లస్టర్ల సహాయ పథక సంచాలకులు, ఉపాధి సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం పట్టణంలోని ప్రకాష్‌నగర్‌లో ఉంటున్న మున్సిపల్ మాజీ చైర్మన్ నాగసరపు సుబ్బరాయగుప్తా గృహాన్ని సందర్శించారు. వారికి గుప్తా మెమెంటోను అందజేశారు. అనంతరం పంచాయతీరాజ్ శాఖ నిధులతో కొత్తపాలెం నుంచి కోటప్పకొండ వరకు చేపట్టిన రోడ్డును పరిశీలించారు. కోటప్పకొండలోని త్రికోటేశ్వరస్వామిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
రూరల్ డెవలప్‌మెంట్ కమిషనర్ కృష్ణతేజ