
శంకుస్థాపన పిల్లర్ వద్ద మాట్లాడుతున్న సాగర్ ప్రాజెక్టు ఈఈ శ్రీహరి
ఓఅండ్‌ఎం ఈఈ వై శ్రీహరి
విజయపురిసౌత్: ఆధునిక దేవాలయం నాగార్జునసాగర్ ప్రాజెక్టు అని నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఓఅండ్‌ఎం ఈఈ వై శ్రీహరి అన్నారు. ఆదివారం నాగార్జునసాగర్ శంకుస్థాపన దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయపురిసౌత్‌లోని సాగర్ ప్రాజెక్టు ముఖద్వారం శంకుస్థాపన పిల్లర్ వద్ద జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఆంధ్ర రాష్ట్ర అన్నపూర్ణగా, బహుళార్ధక సాధక ప్రాజెక్టుగా విరా జిల్లుతున్న నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో వేలాది మంది శ్రమ జీవుల శ్రమశక్తి, వందలాది మంది ప్రాణార్పణలను మరిచి పోకుండా ప్రతి ఏడాది కార్యక్రమాన్ని జరుపుకోవటం హర్షణీయమన్నారు. దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ 1955 డిసెంబర్ 10న ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారన్నారు. సాగర్ ప్రాజెక్టు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు తాగు, సాగునీటితో పాటు విద్యుత్‌ను అందిస్తున్న ఆధునిక దేవాలయంగా కొనియాడబడుతోందన్నారు. ముందు శంకుస్థాపన పిల్లర్ వద్ద నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి, కొబ్బరికాయ కొట్టి నివాళులర్పించారు. కార్యక్రమంలో సాగర్ ప్రాజెక్టు మానిటరింగ్ ఈఈ మురళీధర, డీఈఈ మురళీధర్, జేఈఈలు బాబుమి యా, లక్ష్మీనారాయణ, ఇరిగేషన్ సిబ్బంది పాల్గొన్నారు.