
గుంటూరు వెస్ట్ (క్రీడలు) : గుంటూరు జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 17వ తేదీన స్థానిక బీఆర్ స్టేడియంలో ఉదయం 9 గంటలకు అండర్–12, 14, 16 బాలబాలికల అథ్లెటిక్ పోటీలు నిర్వహిస్తామని జిల్లా కార్యదర్శి జీవీఎస్ ప్రసాద్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 60, 100, 300, 600, 1,000 మీటర్ల పరుగు పందెంతోపాటు లాంగ్ జంప్, షాట్‌పుట్ విభాగాల్లో పోటీలు ఉంటాయన్నారు. వయస్సు ధ్రువీకరణ పత్రంతోపాటు ఆధార్ కార్డు తీసుకురావాలన్నారు.
నేడు అందుబాటులో మైనార్టీస్ కమిషన్
మంగళగిరి : నగరంలోని రాష్ట్ర మైనార్టీస్ కమిషన్ కార్యాలయంలో విచారణ కోసం కమిషన్ మంగళవారం అందుబాటులో ఉంటుందని చైర్మన్ డాక్టర్ కె.ఇక్బాల్ అహ్మద్‌ఖాన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మైనార్టీల క్యాటగిరి కిందకు వచ్చే ముస్లింలు, క్రైస్తవులు, జైనులు, సిక్కులు, పారసీలు తాము ఎదుర్కొంటున్న అన్ని రకాల సామాజిక సమస్యలను, ఫిర్యాదులను కమిషన్‌కు రాతపూర్వకంగా, నేరుగా తెలపవచ్చునని వివరించారు. కమిషన్ సేవలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
నేడు భవిష్యనిధి
పెన్షన్ అదాలత్
గుంటూరు ఎడ్యుకేషన్ : గుంటూరు కృష్ణనగర్‌లోని భవిష్యనిధి ప్రాంతీయ కార్యాలయంలో మంగళవారం పెన్షన్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు పీఎఫ్ కార్యాలయ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల పరిధిలోని పీఎఫ్ పెన్షనర్లు వారి ఫిర్యాదులు, దర్యాప్తులను నేరుగా భవిష్యనిధి కార్యాలయంలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనున్న పెన్షన్ అదాలత్‌లో సమర్పించవచ్చని తెలిపారు. వ్యక్తిగతంగా హాజరు కాలేని వారు ఆన్‌లైన్, వాట్సాప్, వెబ్ మార్గాల ద్వారా పంపవచ్చని సూచించాయి. ro.guntur@epfindia. gov.inతో పాటు వాట్సప్ నంబరు 9494657469కు పంపాలని తెలిపారు. ల్యాండ్‌లైన్ నంబర్లు 0863–2344106, 2232921 నంబర్లో సంప్రదించాలని పేర్కొన్నారు. అదే విధంగా వెబ్ ఎక్స్ ఐడీ 26438264450, పాస్‌కోడ్ epfo@1234 ద్వారా లాగిన్ కావాలని తెలిపారు. పీఎఫ్ పెన్షన్ దారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
నేటి నుంచి అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవం
తెనాలి: బాలల దినోత్సవం సందర్భంగా చిల్డ్రన్ ఫిలిం సొసైటీ, తెనాలి ఆధ్వర్యంలో ఈనెల 14వ తేదీ నుంచి 30 వరకు అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలు జరపనున్నారు. గాంధీనగర్‌లోని ది కల్చరల్ ఫిలిం సొసైటీ కార్యాలయంలో సోమవారం సాయంత్రం సొసైటీ నిర్వాహకులు బి.లలితానంద ప్రసాద్, బొల్లిముంత కృష్ణ వివరాలను తెలియజేశారు. బుర్రిపాలెంరోడ్డులోని శ్రీవివేకానంద సెంట్రల్ స్కూలు ఆవరణలోని ఏవీఎస్ కళావేదికలో మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు ఉత్సవాలను ప్రారంభిస్తామని తెలిపారు. రాష్ట్రంలోని వివిధ ఫిలిం సొసైటీల ద్వారా ఆయా ప్రాంతాల్లోనూ బాలల చిత్రాల ప్రదర్శన 30వ తేదీ వరకు జరుగుతుందని వివరించారు. బాలల మనోవికాసానికి దోహదపడే చిత్రాలకు తల్లిదండ్రులు బిడ్డలతో సహా హాజరై జయప్రదం చేయాలని కోరారు. ఇస్కఫ్ కార్యదర్శి శ్రీకాంత్, కవి, రంగస్థల నటుడు పాతూరి సుబ్రహ్మణ్యం, చైతన్య పాల్గొన్నారు.
నిమ్మకాయల ధరలు
తెనాలిటౌన్: గుంటూరు జిల్లా తెనాలి మార్కెట్ యార్డులో సోమవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.2,400, గరిష్ట ధర రూ.3, 200, మోడల్ ధర రూ.2,700 వరకు పలికింది.
సాగర్ నీటిమట్టం
విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం సోమవారం 524.60 అడుగుల వద్ద ఉంది. శ్రీశైలం జలాశయం నీటిమట్టం 841.50 అడుగుల వద్ద ఉంది.

