అసలే చలికాలం..చన్నీటితో స్నానం.. ప్రబలుతున్న దగ్గు, జలు
వసతి గృహాల్లో చలి, దోమలతో అవస్థలు పడుతున్న విద్యార్థులు ప్రభుత్వ వసతి గృహాలపై ఆరోగ్య శాఖ శీతకన్ను వసతి గృహాల్లో వైద్య శిబిరాల ఊసేలేదు సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నా పట్టించుకోని అధికారులు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి చేతులు దులుపుకుంటున్న వైనం దయనీయంగా మారుతున్న హాస్టల్ విద్యార్థుల పరిస్థితి అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విద్యార్థి సంఘాలు జిల్లాలో 72 ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ వసతి గృహాల్లో 7,400 మంది విద్యార్థులు
సత్తెనపల్లి: జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో ప్రభుత్వ ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ వసతి గృహాల్లో సమస్యలు తిష్టవేశాయి. విద్యార్థుల పరిస్థితి దయనీయంగా మారింది. ఓ వైపు గజగజ వణికే చలి.. మరోవైపు దోమల విలయతాండంతో జ్వరాల బారిన పడుతున్నారు. వేడి నీటి సౌకర్యం ఊసే లేకపోవడంతోపాటు విద్యార్థులకు వైద్యసేవలు అరకొరగా అందుతున్నాయి. వ్యక్తిగత, ఆరోగ్య సంరక్షణపై విద్యార్థులకు అవగాహన కల్పించాల్సిన జిల్లా వైద్యశాఖ అంటీముట్టనట్లు వ్యవహరిస్తోందనే విమర్శలు ఉన్నాయి. అస్వస్థతకు గురైన విద్యార్థులకు వైద్య సేవలు అందించకుండా హాస్టల్ సిబ్బంది తల్లిదండ్రులకు సమాచారం అందించి చేతులు దులుపుకుంటోంది. ప్రతి హాస్టల్‌లో సుమారు 25 శాతం మందికి పైగా వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారని విద్యార్థి సంఘాల నాయకులు చెబుతున్నారు.
వైద్య శిబిరాల ఊసేది?
ప్రభుత్వ వసతి గృహాల్లో నిరుపేద, మధ్యతరగతికి చెందిన విద్యార్థులు అధిక శాతం విద్యనభ్యసిస్తున్నారు. వాతావరణ పరిస్థితుల కారణంగా తరచూ విద్యార్థులు అనారోగ్యానికి గురవుతున్నారు. ప్రధానంగా జ్వరం, తలనొప్పి, కడుపునొప్పి, చర్మ వ్యాధులు, దురదలు, తామర, వాతులు, విరేచనాలు తదితర వ్యాధులు విద్యార్థులను పట్టిపీడిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థులను క్రమం తప్పకుండా పరీక్షించి వైద్య సేవలు అందించాల్సిన బాధ్యత జిల్లా వైద్య ఆరోగ్య శాఖపై ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ప్రాంతాల్లో సామాజిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు, సిబ్బంది వసతి గృహాల్లో వైద్య శిబిరాలు నిర్వహించి వైద్య సేవలు అందించాల్సి ఉంది. ప్రతి రోజూ సంబంధిత వైద్య సిబ్బంది వసతి గృహాలను సందర్శించడంతో పాటు స్థానిక వైద్యాధికారి వారానికి ఒకసారైనా పర్యవేక్షించాల్సి ఉంది. విధిగా ప్రతి 15 రోజులకు ఒకసారి వైద్య శిబిరాలు నిర్వహించాలి. ఇలాంటి పరిస్థితి జిల్లాలో ఎక్కడా కనిపించడం లేదనే విమర్శలు ఉన్నాయి.
పాఠాలు నేర్వని సంక్షేమ శాఖ
సంక్షేమ వసతి గ్రహాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ప్రధానంగా భవనాలకు సరైన కిటికీలు, తలుపులు లేకపోవడం, దోమల నుంచి రక్షణకు మెష్‌లు ఏర్పాటు చేయకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవడం లేదు. గతంలో సత్తెనపల్లిలోని ఒక కళాశాల వసతి గృహంలో భోజనం బాగా లేకపోవడంతో విద్యార్థినిలు ఔషధాలు మింగి ఆత్మహత్యా ప్రయత్నం చేశారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అలాంటి సంఘటనలు జరుగుతున్నప్పటికీ సంక్షేమ శాఖ యంత్రాంగం పాఠాలు నేర్వలేదు. వసతిగృహల్లో సమస్యల పరిష్కారం, వైద్య శిబిరాలు, తగిన మందులు, మాత్రలు అందుబాటులో ఉంచడం లేదు. పర్యవేక్షణ అంతంతమాత్రంగా ఉంది. జలుబు, జ్వరం, మాత్రలు తప్ప ఎటువంటి మందులు వసతి గృహాల్లో లేవు. కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు బారిన పడిన విద్యార్థులకు బయటి నుంచి మందులు తెచ్చుకోమని ఉచిత సలహా ఇస్తున్నారు. మెడికల్ కిట్‌ల ప్రస్తావనే లేదు. విద్యార్థులు ఏ చిన్న జబ్బు చేసినా తల్లిదండ్రులపై ఆధార పడాల్సిన దుస్థితి ప్రతి హాస్టల్‌లో కనిపిస్తోంది. ఇప్పటికై నా పాలకులు, జిల్లా అధికారులు స్పందించి క్షేత్రస్థాయిలో వసతి గృహలు సందర్శించి విద్యార్ధుల ఇబ్బందులు పరిష్కరించడంతో పాటు వైద్య శిబిరాలు నిర్వహించేలా చూడాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
జిల్లాలో వసతి గృహాలు, విద్యార్థుల వివరాలు ఇలా...
వసతి గృహం సంఖ్య విద్యార్థులు
బీసీ ప్రీ మెట్రిక్ 20 2,200
బీసీ పోస్ట్ మెట్రిక్ 14 1,400
ఎస్సీ ప్రీ మెట్రిక్ 18 1,800
ఎస్సీ పోస్ట్ మెట్రిక్ 11 1,100
ఎస్టీ ప్రీ మెట్రిక్ 06 600
ఎస్టీ పోస్ట్ మెట్రిక్ 03 300
అసలే చలికాలం..చన్నీటితో స్నానం.. ప్రబలుతున్న దగ్గు, జలు
అసలే చలికాలం..చన్నీటితో స్నానం.. ప్రబలుతున్న దగ్గు, జలు


