ప్రాణాలు తీస్తున్న నిర్లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

ప్రాణాలు తీస్తున్న నిర్లక్ష్యం

Dec 19 2025 8:17 AM | Updated on Dec 19 2025 8:17 AM

ప్రాణ

ప్రాణాలు తీస్తున్న నిర్లక్ష్యం

ప్రాణాలు తీస్తున్న నిర్లక్ష్యం

మొన్న శరీరంలో బ్లేడు పెట్టి కుట్టేసిన వైద్యులు

తాజాగా రక్తహీనత ఉన్నా గర్భిణికి ఆపరేషన్‌

వికటించడంతో మృతి చెందిన బాలింత

పేదల ప్రాణాలతో చెలగాటం

ప్రభుత్వాస్పత్రి పేరు చెబితేనే భయపడుతున్న ప్రజలు

నరసరావుపేట ప్రభుత్వాస్పత్రి వైద్యుల తీరు

పురిటి నొప్పుల బాధను పంటి బిగువున భరించింది ఆ ఇల్లాలు...పండంటి బిడ్డకు జన్మనిచ్చింది..బిడ్డను మురిసిపోవాలని కలలుగన్న మాతృమూర్తి.. ఆ బిడ్డ కళ్లు తెరవముందే కన్నుమూసింది. రక్తహీనత ఉన్నా గర్భిణికి పురుడుపోసిన వైద్యుల నిర్లక్ష్యం ఆమె ప్రాణాలను బలిగొంది. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో వైద్యం ఖరీదు కావడంతో పేదలు ప్రభుత్వ ఆస్పత్రులనే ఆశ్రయిస్తున్నారు. ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం కారణంగా సర్కారు దావఖానా అంటేనే భయపడుతున్నారు.

నరసరావుపేట టౌన్‌: ప్రభుత్వ వైద్యశాలలో మెరుగైన వైద్యసేవలు అందించడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రంటే పేదలకు ప్రాణాలు నిలిపే కేంద్రాలన్నది ఒకప్పటి మాటైతే..ప్రస్తుతం పల్నాడు జిల్లాలో వరుసగా జరుగుతున్న నిర్లక్ష్యపు వైద్యంతో ప్రభుత్వ వైద్యంపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లుతోంది. వైద్య సేవల కోసం వెళ్లాలంటే ప్రజలు ఆందోళన చెందాల్సిన పరిస్థితి నెలకొంది. కార్పొరేట్‌ వైద్యశాలలకు వెళ్లి వేలకు వేలు చెల్లించలేని పేద, మధ్యతరగతి ప్రజలు ఎక్కువ ప్రభుత్వ వైద్యశాలనే ఆశ్రయిస్తుంటారు. అక్కడ ఉచిత వైద్యంతోపాటు మెరుగైన సేవలు అందుతాయన్న నమ్మకం గత ప్రభుత్వంలో ఉండేది. కూటమి ప్రభుత్వంలో నిర్లక్ష్యపు వైద్యం కారణంగా పేదల ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి. వైద్య రంగంపై ప్రభుత్వం చూపుతున్న సవతి తల్లి ప్రేమతో సరిపడా సిబ్బంది, మౌళిక వసుతులు లేకపోవడానికి తోడు కొంతమంది వైద్యుల నిర్లక్ష్యం రోగుల పాలిట శాపంగా మారుతోంది.

బాలింత మరణం

పల్నాడు ప్రాంతానికే పెద్దాసుపత్రిగా పేరొందిన ఏరియా వైద్యశాలలో బాలింత మృతి చెందడం దిగ్భాంతికి గురిచేసింది. రెంటచింతల మండలం పాల్వాయి గేటుకి చెందిన సాగరమ్మ పురిటి నొప్పులతో బాధపడుతూ రెండు రోజుల కిందట పల్నాడు రోడ్డులోని పాత ప్రభుత్వ వైద్యశాలలో చేరింది. రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణీకి తగిన పరీక్షలు, ముందస్తు వైద్య జాగ్రత్తలు తీసుకోకుండా శస్త్ర చికిత్స చేశారు. మగబిడ్డకు జన్మనిచ్చిన అనంతరం తీవ్ర రక్తస్రావమై పరిస్థితి విషమించి బాలింత ప్రాణాలు కొల్పోయింది. ఈ సంఘటన ప్రభుత్వ వైద్య వ్యవస్థలో లోపాన్ని ఎత్తిచూపుతోంది. మాతాశిశు మరణాలు అరికట్టామని గొప్పగా చెప్పుకొనే ప్రభుత్వం నరసరావుపేటలో బాలింత మరణం వాస్తవికతను తెలియజేస్తోంది.

సంతకం పెడితేనే వైద్యం..

గర్భిణులు కాన్పు చేయాలంటే తల్లీబిడ్డకు ఏదైనా జరిగితే వైద్యులకు సంబంధంలేదని ముందుగా కుటుంబ సభ్యులు రాసి సంతకం పెడితేనే వైద్యం చేస్తానన్న సంఘటన సత్తెనపల్లి ప్రభుత్వ వైద్యశాలలో చోటుచేసుకుంది. తాను చెప్పినట్టు రాసి సంతకం పెట్టకుంటే వైద్యం చేయనని ఖారాఖండిగా చెప్పింది. దీంతో సంతకం పెట్టి వైద్యసేవలు పొందాల్సిన దుస్థితి నెలకొంది. ఈ విషయం బయటకు పొక్కడంతో ఆ వైద్యరాలిపై ఉన్నతాధికారులు బదిలీ వేటు వేసి చేతులుదులుపుకున్నారు.

సత్వర వైద్యం అందని ద్రాక్ష

జిల్లాలోని కొన్ని ప్రభుత్వ వైద్యశాలల్లో సత్వర వైద్యం అందని ద్రాక్షగా మారింది. చిలకలూరిపేట నియోజకవర్గంలోని నాదెండ్ల పీహెచ్‌సీకి ఇటీవల వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్‌ వీరపాండ్యన్‌ తనిఖీకి వెళ్లారు. ఆ సమయంలో పీహెచ్‌సీకి తాళం వేసి ఉండటం చూసి అవాక్కయ్యారు. ప్రభుత్వ చీఫ్‌ విప్‌ వినుకొండ ఎమ్యెల్యే జీవీ ఆంజనేయులు వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేయగా ఆ సమయంలో విధుల్లో ఉండాల్సిన వైద్యులు కనిపించలేదు. ఆరా తీయగా ప్రతి రోజూ ఇదే తంతు అని తెలుసుకొని వైద్యులపై చర్యలకు ఆదేశించారు. ఈ రెండు సంఘటనలు వైద్యసేవల్లో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి.

ప్రాణాలు తీస్తున్న నిర్లక్ష్యం1
1/1

ప్రాణాలు తీస్తున్న నిర్లక్ష్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement